సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు మొన్నటి ఖమ్మం వరదల వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. బడ్జెట్ పై ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడిన మాటలే చివరివి.
కేటీఆర్, హరీష్ రావులు ఎంత విమర్శించినా… కేసీఆర్ మాత్రం క్లారిటీతో ఉన్నారు. ప్రజల్లో అసంతృప్తి వస్తే పోతుంది, కానీ వ్యతిరేకత వస్తే తట్టుకోలేము అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ పై రైతుల్లో ఉన్న అసంతృప్తి వ్యతిరేకతగా మారాలన్న ఆలోచనతో ఆయన వెయిట్ చేస్తున్నట్లు కనపడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం 100రోజుల్లో హామీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చింది. దాదాపు 10నెలలు గడుస్తున్నా హామీలు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, రైతుబంధు అంశంపై కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈనెల 18న తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం నుండే మొదట పార్టీ ప్రక్షాళన స్టార్ట్ చేయబోతున్నారు. ఉద్యమకారులకు పార్టీలో కీలక పదవులు ఇవ్వటంతో పాటు కేసీఆర్ యాక్టివ్ టీంను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ రెగ్యూలర్ గా జిల్లా పర్యటనలు, రైతులతో భేటీలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.
కేసీఆర్ పర్యటనల సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు ఎక్కడా యాక్టివ్ గా కనపడరు. కేసీఆర్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంటే వీరిద్దరూ దక్షిణ తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ కవిత రోల్ ఏంటీ అనేది స్పష్టత రాబోతుంది.