హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పీవీ కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా నిలబెట్టి కేసీఆర్ టెన్షన్ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గెలిపించకపోతే ఓడిపోయే సీటు ఇచ్చామంటారు. పీవీని అవమానించారని విమర్శలు గుప్పిస్తారు. ఏ లక్ష్యం కోసం అయితే పీవీకి అత్యున్నత గౌరవం ఇస్తూ కార్యక్రమాలు చేస్తున్నారో అది దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే.. కేసీఆర్ ఇప్పుడు.. వాణిదేవి విజయం కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ఎన్నికల పూర్తి భాధ్యతను మంత్రులకు అప్పగించారు. వాణిదేవిని ఎన్నికల్లో పోటీకి ఒప్పించడానికి టీఆర్ఎస్ నేతలు కష్టపడాల్సి వచ్చింది.
ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని తామే చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం.. అభ్యర్థి ప్రచారం చేయడం కష్టం. దీంతో మంత్రులే అభ్యర్థులుగా భావించి రంగంలోకి దిగాల్సి ఉంది. ఎన్నికలు జరుగుతున్న జిల్లా ల మంత్రులు ఎమ్మెల్యే లతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కు మంత్రి ప్రశాంత్ రెడ్డిని , రంగారెడ్డి జిల్లా కు హరీష్‌రావును ,హైదరాబాద్ జిల్లా బాధ్యతలను గంగుల కమలాకర్ కు అప్పగించారు. వరంగల్ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.
అక్కడ కేసీఆర్ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే కేసీఆర్ తన దృష్టి మొత్తం వాణిదేవి గెలుపుపై పెడుతున్నారు. ఇందు కోసం ఆయన రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. అభ్యర్థిని నిలపకుండా .. ప్రొ.నాగేశ్వర్ కో మరొకరికో మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని… ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టి అనవసర ప్రయోగం చేసి.. రెండు విధాలా నష్టం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్లోని ఓ వర్గం గుసగుసలాడుతోంది.