తెలంగాణ కాళ్ల దగ్గర ఏపీని పడేసే అతి పెద్ద నిర్ణయాన్ని జగన్ తీసుకోబోతున్నారు. నీటి విషయంలో దిగువ రాష్ట్రానికి ఉండే హక్కులన్నంటిన ఎగువ రాష్ట్రం తెలంగాణకు కట్టబెట్టేందుకు జగన్.. ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఈ విషయంలో కేసీఆర్ అడుగు ముందుకు వేయడం.. జగన్‌కు ఓకే చెప్పడం మినహా.. మరో అవకాశం లేకుండా చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య వచ్చే జలవివాదాలను పరిష్కరించుకోవడానికి విభజన చట్టంలో అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. ఏపీ కూడా ఒప్పుకుంటే.. ఈ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తారు. జగన్ ఇప్పటి వరకూ కేంద్రానికి ఏ విషయం చెప్పలేదు. ఇలా నసుగుతున్నారంటనే…ఆయన అంగీకారనికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
వివాదాలు పరిష్కరించాల్సిన అపెక్స్ కౌన్సిల్‌ను వద్దునుకోవడం ఏమిటి..?
విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్‌ను విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసింది. అవార్డుల ప్రకారం, ఒప్పందాల ప్రకారం నీటిని వాడుకోవాలని, ఏమైనా సమస్యలు వచ్చినా, వివాదాలు తలెత్తినా, కొత్త ప్రాజెక్టులు కట్టాలన్నా కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అపెక్స్ కౌన్సిల్‌కు ఆయా బోర్డులు సిఫార్సులు చేస్తాయి. బోర్డు అనుమతించకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ప్రాజెక్టులను నిర్మించకూడదు. వివాదాలు ఇక్కడే పరిష్కరించుకోవాలి. కానీ ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదని.. కేసీఆర్ చెబుతూండగా.. తలూపడానికి జగన్ సిద్ధమయ్యారు.
ఎగువ రాష్ట్రానికి హక్కులు రాసిచ్చేయడం సబబేనా..?
ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటికే అక్రమంగా అనేక ప్రాజెక్టులు కడుతోందని… ఏపీ వాదిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు అక్రమమని వాదిస్తూ గతంలో సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాళేశ్వరంపైనా ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎగువ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టులు కడితే.. అత్యంత దిగువన ఉన్న ఏపీ .. తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే కృష్ణా డెల్టా తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పుడు తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులతో గోదావరిలో కూడా నీటి లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది.
భవిష్యత్ తరాలకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు..?
అపెక్స్ కౌన్సిల్ లేకుండా చేసుకుంటే.. ఏపీ నెత్తిన ఏపీ చెయ్యి పెట్టుకున్నట్లే అవుతుంది. ఎగువ రాష్ట్రం ఎలాంటి ప్రాజెక్టులైనా కట్టుకుని.. ఎలాగైనా నీటిని మళ్లింపు చేసుకునే సర్వ హక్కులు.. తెలంగాణకు దఖలు పర్చినట్లు అవుతుంది. తర్వాత మా నీళ్లన్నీ వాడుకుటున్నారని.. కేంద్రం వద్దకు ఫిర్యాదుతో వెళ్తే.. అపెక్స్ కౌన్సిల్ వద్దంటూ ఇచ్చిన లేఖను చేతిలో పెట్టి వెనక్కి పంపుతారు. అంటే… భావితరాలకు … తీవ్ర అన్యాయం చేసినట్లే. రైతుల నోట్లో మట్టికొట్టినట్లే. ఈ విషయంపై జగన్ సర్కార్ ఏం చేస్తుందనేది.. ఇప్పుడు తేలాల్సి ఉంది. అపెక్స్ కౌన్సిల్ వద్దని నిర్ణయిస్తే.. మాత్రం..రైతాంగాన్ని ఎవరూ కాపాడలేరు.