ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శిఖరాగ్ర సమావేశం జరుగుతోందంటే.. ఓ ఎజెండా ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య ఏ ఏ అంశాలు పరిష్కారానికి ఉన్నాయో… ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాల్సినవి ఎన్ని ఉన్నాయో.. జాబితా సిద్ధం చేస్తారు. ఆ ప్రకారం.. సంబంధిత అధికారులందరూ.. రికార్డులతో సహా వెళ్తారు. మరో రాష్ట్రం వైపు నుంచి కూడా.. అదే తరహా కసరత్తు జరగాలి. కానీ.. నేడు జగన్మోహన్ రెడ్డి – కేసీఆర్‌ల మధ్య జరగనున్న చర్చల్లో… ఎజెండా లేదు. అధికారులు కూడా పాల్గొనడం లేదు. అది జగన్-కేసీఆర్ మధ్య రాజకీయ చర్చల కోసం జరుగుతున్న భేటీగా భావిస్తున్నారు.
అధికారులు ఎవరూ లేకుండానే ప్రగతిభవన్‌కు జగన్..!?
విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని .. కేంద్రం జోక్యం అవసరం లేదని.. మొదట్లో కేసీఆర్, జగన్ ప్రకటనలు చేశారు. దానికి తగ్గట్లుగా ఓ సారి ప్రగతి భవన్లో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు.. వివిధ శాఖ ఉన్నతాధికారులతో సహా.. భారీ భేటీ నిర్వహించారు. అందులో… కొంత మంది ఏపీ అధికారులు… ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌ను జగన్ ముందే అభినందించారు కూడా. ఆ చర్చల తర్వాత కొంత మంది అధికారులు సమావేశమయ్యారు. వాటి ఫలితం ఏమయిందో కానీ.. మరోసారి భేటీ జరగలేదు. సమస్యలు పరిష్కరించుకుంటామంటూ.. హైదరాబాద్‌లోని ఏపీ భవనాలన్నీ..తెలంగాణకు జగన్ ఇచ్చేశారు. కానీ ఏపీకి రావాల్సిన వాటిలో ఒక్కటంటే.. ఒక్కటీ సానుకూల నిర్ణయం తెలంగాణ వైపు నుంచి తీసుకు రాలేకపోయారు. విద్యుత్ బకాయిలు రాలదు.. విద్యుత్ ఉద్యోగుల సమస్య కూడా తీరలేదు. కానీ చర్చోపచర్చలు మాత్రం నడుస్తున్నాయి.
రాజకీయ సలహాలు, సూచనల కోసమా..?
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో.. కేసీఆర్ సూచనలు, సలహాల కోసమే.. జగన్మోహన్ రెడ్డి ప్రగతిభవన్‌లో ఆయనతో భేటీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత సెప్టెంబర్‌లో కేసీఆర్ – జగన్ సమావేశమయ్యారు. అప్పుడు కూడా.. ఎలాంటి అధికారులు వెంట లేరు. కానీ… రెండు, మూడు గంటల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రధానంగా రాజకీయాలపై చర్చ జరిగిందని.. బీజేపీని ఢీకొట్టడంపై.. నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. తర్వాత పత్రికల్లో అదే అంశంపై వార్తలు వస్తే జగన్ ఖండించారు. కానీ కేసీఆర్ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు.. ఆ రాజకీయ చర్చలకు కొనసాగింపేనని తెలుస్తోంది.
ఎన్ని సార్లు భేటీలు జరిగినా ఒక్క వివాదమూ ఎందుకు పరిష్కారం కాలేదు..?
ప్రజలకు మాత్రం.. విభజన సమస్యలపై చర్చించినట్లుగా.. సహజంగానే ప్రెస్‌నోట్ విడుదలవుతుంది. గతంలోనూ అదే జరిగింది. ముఖ్యమంత్రుల స్థాయిలో అనేక సార్లు సమావేశమైనా… ఒక్క విభజన సమస్యపైనా ఎందుకు పరిష్కారం చూపలేకపోయారో కానీ.. చర్చలకు మాత్రం లోటు ఉండటం లేదు. ఇరు ముఖ్యమంత్రులు పలుమార్లు భేటీ అయిన తర్వాతే.. ఏపీకి వ్యతిరేకంగా… తెలంగాణ, తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఉమ్మడి ప్రాజెక్ట్ లేదనే విషయాన్ని జగన్.. పరోక్షంగా చెబుతున్నారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచుతానని ప్రకటిస్తూ.. తెలంగాణ రాజకీయాల్లో కలకలకానికి కారణం అవుతున్నారు. ఇలాంటి సమయంలో చర్చలు.. రాజకీయమే తప్ప.. ప్రజాప్రయోజనం కాదని.. విమర్శలు ముందుగానే వస్తున్నాయి.