ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి… తెలుగుదేశం ఒక పక్క, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భాజపా, తెరాస మరోపక్క అన్నట్టుగా ప్రచారం జరిగింది. తనను ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ పరోక్షంగా జగన్ కి మద్దతు ఇచ్చారనీ, వీరికి భాజపా మద్దతు కూడా అందుతోందని ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే, తమకు ఎవ్వరూ మద్దతులేరంటూ జగన్ కొట్టిపారేసిన సందర్భాలూ ఉన్నాయి. తెరాసతో తమకు ఎలాంటి మిలాకత్ ఉండదనీ భాజపా నేతలూ ఖండించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఎన్నికల తరువాత పరిస్థితులు ఎలా ఉండబోతాయనే అంశంపై ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
తమ దగ్గర కింగ్ ఉన్నారనీ, కాబట్టి తమకు కింగ్ మేకర్ల అవసరం లేదంటూ ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు రాం మాధవ్. దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి, తామెందుకు కాలేమని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కలలు కంటున్నారన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీ కూటమి కారణంగా కొన్ని సీట్లు తగ్గొచ్చేమోగానీ, అదే స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో తాము ఎంపీ స్థానాలు గెలవబోతున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా, కర్ణాకటలో ఎక్కువ సీట్లు గెలవబోతున్నామనీ, తెలంగాణలో కూడా మరిన్ని స్థానాలు తమకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఓవరాల్ గా పెద్దగా కోల్పోయే స్థానాలేం లేవనీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు వచ్చే సీట్లను కలుపుకున్నా కూడా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి కేసీఆర్ తో మీరు ముందునుంచే టచ్ లో ఉన్నారా… అవసరమైతే వారి మద్దతు తీసుకోవాలనే వ్యూహంతో ఉన్నారా అనే ప్రశ్నకు రాం మనోహర్ నేరుగా సమాధానం చెప్పలేదు. అవన్నీ రాజకీయ ఎత్తుగడలకు సంబంధించిన వ్యవహారాలనీ, కెమెరాల ముందు మాట్లాడేవి కావన్నారు. భాజపాతో కలిసి పనిచేద్దామని ముందుకొచ్చేవారిని తాము స్వాగతిస్తామన్నారు. అంతేగానీ…. వారితో టచ్ లో లేరని మాత్రం ఖండించి చెప్పలేదు. రాం మాధవ్ మాటల్లో రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయేకి సొంతంగా మెజారిటీ రాదనే భావన ఆయనకీ లోలోన ఉందనేది ఒక విధంగా అర్థమౌతోంది. అందుకే, ఎవరొచ్చినా స్వాగతిస్తామని తలుపు తెరిచి పెట్టుకున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇక, రెండోది.. వైకాపా, తెరాసలతో టచ్ లో లేమని స్పష్టంగా చెప్పకపోవడంలోనే అసలు విషయం అర్థమౌతోంది కదా!