ఒకప్పుడు ఉద్యమ నాయకులతో నిండిన తెరాస, ఇప్పుడు కాంగ్రెస్, తెదేపా నేతలతో నిండిపోయి దాని అసలు స్వరూపమే పూర్తిగా కోల్పోయింది. ఒకప్పుడు కేవలం తెలంగాణా సాధన కోసమే ఆలోచించిన తెరాస, ఇప్పుడు వరుసగా వస్తున్న ఎన్నికలలో విజయం సాధించడం, దాని కోసం ప్రతిపక్ష పార్టీల నేతల ఫిరాయింపుల గురించే ఎక్కువగా ఆలోచిస్తోందనే అభిప్రాయం, అసంతృప్తి పార్టీలో, ప్రజలలో కూడా వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాల విమర్శలు సరేసరి.
మాటల మాంత్రికుడుగ పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విమర్శలకు ధీటుగా జవాబు చెప్పడమే కాకుండా, తన అప్రజాస్వామిక కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సమర్ధించుకోవడం విశేషం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఖమ్మం జిల్లాకు చెందిన మరికొంత మంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను నిన్న తెరాసలో చేర్చుకొంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను వింటే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమాత్రం తప్పు కాదనే అభిప్రాయం కలుగుతుంది. అంత చక్కగా ఆయన తన తప్పును సమర్ధించుకొన్నారు.
ఆ సందర్భంగా పార్టీ నేతలని, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రజా ప్రతినిధులు తెరాసలో చేరడాన్ని రాజకీయ శక్తుల పునరేకీకరణ చూడాలి తప్ప చిల్లర మల్లర రాజకీయ చేరికలుగా చూడరాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బంగారి తెలంగాణా సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలే. తెలంగాణాలో రాజకీయ శక్తుల పునరేకీకరణ చారిత్రిక అవసరం. మనం తెలంగాణా అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే, రాష్ట్రానికే చెందిన కొందరు నోటికి వచ్చినట్లు ఏదేదో వాగుతుంటారు. అటువంటివారిని మనం పట్టించుకోనవసరం లేదు. ఈ ముక్క నేను చెప్పింది కాదు ప్రజలే చెప్పారు. బంగారి తెలంగాణా సాధనే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోదాము. మనతో వచ్చే వాళ్ళు వస్తారు రానివాళ్ళ సంగతి ప్రజలే చూసుకొంటారు. భవిష్యత్ తరాలకు ఏమాత్రం నష్టం జరగకుండా మనం చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటూ, రాష్ట్రాభివృద్ధి చేసుకొంటున్నాము. ఇప్పటి వరకు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేయగలిగితే మన రాష్ట్రం రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. అందుకోసం పార్టీలో అందరూ సమిష్టి కృషి చేయాలి,” అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఎవరూ ఆక్షేపించలేరు కానీ ‘భవిష్యత్ తరాలకు నష్టం’ జరగకుండా ఉండటానికి ఆయన వలసలను ప్రోత్సహించుతూ, దానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే గంభీరమయిన పేరు పెట్టడం, అది తప్పు కాదన్నట్లుగా వాదించడం, పైగా తమ పార్టీలో చేరనివారు రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడటం సరికాదు. ఆయన తన మాటకారితనంతో తను చేస్తున్న అప్రజాస్వామిక పనులకు అందంగా సర్ది చెప్పుకోవచ్చు కానీ అంతమాత్రన్న అవి తప్పులు కాకుండాపోవు.