ఒక్క ఓటమి బీఆర్ఎస్కు అనేక సమస్యలు సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబంలో అనేక వివాదాలు తెరపైకి వచ్చినట్లుగా ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట హరీష్ రావు.. తెలంగాణ భవన్ లో ఓ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టడమే కాదు.. జిల్లాల పర్యటనలు కూడా చేస్తారని ప్రకటించారు. నిజానికి కేసీఆర్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మొత్తం కేటీఆర్ చూసుకునేవారు. మరి ఇప్పుడు హరీష్ రావు ఈ ప్రకటన ఎందుకు చేశారు ?
తాను ఎంపీగా పోటీ చేస్తాననే సంకేతాలను కేటీఆర్ పంపారు. కేటీఆర్ లోక్సభకు పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. కేసీఆర్ లోక్సభకుపోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ కేటీఆర్ అలాంటి ఆలోచన చేస్తారని ఎవరూ ఆనుకోలేదు. కేటీఆర్ కూడాలోక్ సభకు పోటీ చేస్తే… కేసీఆర్ లేదా కవితల్లో ఒకరు విరమించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. కవిత ఎప్పట్లాగే నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి కేటీఆర్ కూడా పోటీ చేస్తే.. అందరూ లోక్ సభకే పోటీ చేసినట్లవుతుంది. ఇలా చేసే అవకాశం ఉండదు. మరి కేటీఆర్ ఎందుకు లీక్ ఇచ్చినట్లు ?
ఇప్పటి వరకూ కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే.. కవిత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అనూహ్యంగా కేటీఆర్ లోక్సభకు పోటీ అనే ప్రచారం… ఫ్యామిలీ పాలిటిక్స్ అనే అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పెత్తనం ఇక ఉండదని..కేసీఆర్ మళ్లీ అన్నీ చూసుకుంటారన్నట్లుగా హరీష్ రావు ప్రకటించడం కూడా.. చర్చనీయాంశం గా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందే ఇవి పెరిగితే… మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.