తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ క్రమంగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారానికి .. ఆయనతో టీఆర్ఎస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు దీనికి కారణం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. సీనియర్ నేతలకు బాధ్యతలిచ్చారు. చివరికి.. హరీష్ రావుకు కూడా… ఓ జిల్లా బాధ్యత ఇచ్చారు. అయితే ఈటల గురించి పట్టించుకోలేదు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన గంగుల కమలాకర్‌కు కీలక బాధ్యతలిచ్చారు. పైగా అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉపఎన్నికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా ఆహ్వానం పంపలేదు.
దీంతో ఈటల మనస్తాపానికి గురయ్యారు. కరీంనగర్ వెళ్లిపోయారు. ఈటలకు ఎలాంటి ఆహ్వానం లేని సమయంలో గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది సొంత పార్టీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని… విమర్శించారు. అది ఈటలను ఉద్దేశించేనని టీఆర్ఎస్లో ప్రచారం జరిగింది. ఈటల నిజంగా పార్టీ పెట్టాలనుకుంటున్నారో లేదో కానీ.. ఆయనపై టీఆర్ఎస్లో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. సొంత పార్టీ పెట్టబోతున్నారన్న కారణం చూపి.. ఈటలను టీఆర్ఎస్ అధినేత దూరం పెడుతున్నారని.. కానీ ఈటల పార్టీ పెట్టే పరిస్థితి లేదని కొంత మంది అంటున్నారు.
ఈటల పార్టీ ఆలోచన చేస్తే.. అది ఆయన ఒక్కరిది కాదని.. చాలా మంది ఉండి ఉంటారని కూడా చెబుతున్నారు. కారణం ఏదైతేనేం.. మొత్తానికి ఇప్పుడు… ఈటలను దూరం పెడుతున్నారు. ఆయన పార్టీ మారడమో.. లేకపోతే నిజంగా పార్టీ పెట్టడమో తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. టీఆర్ఎస్లో.. ప్రభుత్వంలో సమూల మార్పులకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పరిణామాలన్నీ…టీఆర్ఎస్లో గుసగుసలకు కారణం అవుతున్నాయి.