ఆమ్ ఆద్మీ పార్టీతో భారత రాష్ట్ర సమితికి ర్యాపో పెరుగుతోంది. ఆప్ నేతలు వరుసగా తెలంగాణకు వచ్చి తెలంగాణ సర్కార్ ను తెగ పొగిడేస్తున్నారు. కేసీఆర్, కేజ్రీవాల్ కలిసి పని చేస్తే తిరుగు ఉండదని జోస్యం చెబుతున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హైదరాబాద్ వచ్చి వెళ్లిన వారానికే ఓ ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చింది. నిజామాబాద్ లో పర్యటించి కేసీఆర్ పాలనా తీరుపై ప్రసంసలు గుప్పించింది. కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం సాధ్యమవుతుందని ఆ బృందానికి నాయకత్వం వహించిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రకటించేశారు. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు అందరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కేజ్రీవాల్ పార్టీ ఆప్ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకుంటూ పోతోంది. ఇటీవల గుజరాత్ లో సాధించిన సీట్లు, ఓట్లతో ఆ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కూడా.. దేశ్ కీ నేత అవ్వాలనుకుంటున్నారు. అందుకే అత్యంత సాహసం అయినప్పటికీ తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు. తన పార్టీకి జాతీయ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అటు కేజ్రీవాల్.. ఇటు కేసీఆర్ లక్ష్యం దేశ్ కీ నేత కావడమే. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అయితే ముందుగా బీజేపీని కలసికట్టుగా ఓడిస్తే ఆ తర్వాత నాయకుడు ఎవరు అన్నది పరిస్థితిని బట్టి తేల్చుకోవచ్చన్న అవగాహనకు వస్తే మాత్రం ఈ ఇద్దరూ కలిసే అవకాశాలు ఉంటాయి. కేజ్రీవాల్ సహజంగా ఉత్తరాదిన ఎ్కకువ పాపులర్. కేసీఆర్ దక్షిణాదిన పాపులర్. ఇద్దరూ ఇలా ఒకరు ఉత్తరాదిన.. మరొకరు దక్షిణం చూసుకుని సంచనం సృష్టిస్తే.. రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. అయితే ఆప్ నేతలు ఆవేశపడుతున్నారా లేక వ్యూహాత్మకంగానే ఈ ప్రకటనలు చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీైవల ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభిస్తే ఒక్క ఆప్ నేత కూడా రాలేదు.