తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ భేటీ కలకలం రేగుతోంది. గత ఆదివారం ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్ కు వచ్చారని.. కేసీఆర్,కేటీఆర్ మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో ఒక్క సారిగా గుప్పు మంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని విశ్లేషించుకున్నారని.. ఇంటలిజెన్స్ రిపోర్టులు, ఇతర సర్వేలను బట్టి చూస్తే… మౌత్ టాక్ కాంగ్రెస్ వైపు ఉందని.. దాన్ని ఎలా మార్చాలన్న అంశంపై చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల కేసీఆర్ తమ మేనిఫెస్టో గురించి కూడా సభల్లో చెప్పడం లేదు., కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏదో జరిగిపోతుందని ఓటర్లను భయటపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దామనుకునేవారి ఆలోచనల్లో మార్పు తెస్తే.. ఫలితం మారదని.. గత ఎన్నికలలోలానే ఉంటుందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే అప్పటి నుండి రాజకీయం మారిపోయిందని… కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకునేవారి ఆలోచనలో మార్పు తెచ్చేందుకు… ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు వైపు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి ఒప్పందం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పీకేతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ తర్వాత వద్దనుకున్నారు. పీకేని భరించలేక .. ప్రభుత్వాన్ని కూడా ఎలా నడపాలో చెబుతున్నందున వద్దనుకున్నామని కేటీఆర్ చెప్పారు. అయితే.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఎంతో అవసరం అని ఆయనను ప్రగతి భవన్ పిలిపించి మాట్లాడారని చెబుతున్నారు. ఆయన ఏ సలహాలు ఇచ్చారో… వచ్చే వారం రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.