పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెత్తిన పెట్టుకుంటే తన్నేసి పోతున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పిటిషన్లు వేస్తున్నారు. అక్కడ్నుంచి నిర్ణయం రాక ముందే కోర్టుకు వెళ్తామని హడావుడి చేస్తున్నారు. నిజానికి గత చరిత్ర ఎంతో ఘనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. వీలైనంత వరకూ మౌనం పాటిస్తే.. తమ పాత ఘనకార్యాలు చర్చల్లోకి రాకుండా ఉంటాయి. కుదిరితే.. ఎమ్మెల్యేలకు భరోసా కల్పించి పార్టీ మారకుండా చూసుకోవాలి. అంతే కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏదో చేస్తామని ఆవేశపడితే .. పాత లెక్కలన్నీ బయటకు వస్తాయి.
పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ దేశంలోనే ఓ కొత్త మోడల్ సృష్టించారు. అదేమిటంటే. ఎల్పీల విలీనం. అసలు ఎల్పీల విలీనం అనే అంశం ఎక్కడా లేదు. కేసీఆరే సృష్టించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీ కి చెందిన మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకుంటే..అనర్హతా వేటు వర్తించదు. వారిని స్పీకర్ ప్రత్యేకంగా గుర్తించవచ్చు. కానీ ఈ నిబంధనను విలీనంగా వాడేసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ , టీడీపీ ఇలా ఏ పార్టీని వదిలి పెట్టలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్కు వచ్చింది.
ఇప్పుడు తాము ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు ప్రయత్నిస్తామని వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆగడం లేదు. గతంలో ఏం చేశారనే ప్రశ్న వస్తుందని తెలిసినా తగ్గడం లేదు. నిజానికి కేసీఆర్ అయినా.. కేటీఆర్ అయినా ఇప్పుడు చేయాల్సింది.. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ..భవిష్యత్ ఉంటుందని వారికి భరోసా కల్పించడం. ఆ పని మానేసి.. బెదిరించి పార్టీలో ఉంచుకుంటామన్నట్లుగా తీరు ఉంది. ఏదైనా అంతిమంగా స్పీకర్ నిర్ణయమే. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కాదనలేవు. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలకు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా ?