ఎన్డీఏ రూపంలో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని కేసీఆర్ విస్తృత కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ పూర్తిగా పొలిటికల్ అప్ డేట్స్ ఫాలో అవడం మర్చిపోయారా లేకపోతే.. గుడ్డిగా చంద్రబాబును టార్గెట్ చేస్తే బీఆర్ఎస్కు మళ్లీ ఊపిరి ఊదుకోవచ్చు అనుకున్నారా అన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్డీఏ ఏపీలో ఉంది కానీ.. తెలంగాణలో ఉందని ఎవరూ చెప్పడం లేదు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు చేస్తోంది. తమకు ఏ పార్టీతో కూడా పొత్తుల్లేవని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. టీడీపీ ఎప్పుడూ తెలంగాణ బీజేపీతో కలిసి కార్యక్రమాలు చేపట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసిన తర్వాత జనసేన పార్టీ కూడా బీజేపీతో కలిసింది లేదు. మరి ఎన్డీఏ ఎక్కడుంది ?. చంద్రబాబు సొంతంగా టీడీపీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. దాని కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ సింగ్ సలహాలు తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. కానీ దానికి కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు.
చంద్రబాబు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని కూడా నియమించలేదు. పార్టీని అలా వదిలేశారు. పార్టీలో చేరుతానని వచ్చిన తీగల కృష్ణారెడ్డి వంటి వారికి కూడా ఇంకా కండువాలు కప్పలేదు. ఆయన వ్యూహం ఏమిటో తెలియదు. అయితే ఎన్డీఏ ను తెలంగాణలో అధికారలోకి తీసుకు వచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కేసీఆర్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ.. చంద్రబాబు వస్తున్నారని కామెంట్ చేశారు. అయితే చంద్రబాబును బూచిగా చూపించే అరిగిపోయిన ఆయుధాన్ని కేసీఆర్ నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.