సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయం చాలామందికి ఉంది. రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరుతో తెరాసకు మాక్సిమమ్ మైలేజ్ వచ్చేలా ఫిరాయింపులు చేపట్టారు! ఇక, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకుంటే తెరాస పట్టుకు చిక్కని జిల్లా నల్గొండ అని చెప్పాలి. గత ఎన్నికల్లో కొంత ఉనికి చాటుకున్నా… ఈ జిల్లాపై కాంగ్రెస్ తోపాటు కమ్యూనిస్టుల పట్టు కూడా బాగానే ఉంటుంది. ఈ పునాదుల్ని కదలదీసి తెరాస తిష్ట వేయడం అనేది అంత సులువైన పని కాదనే విషయం కేసీఆర్ కూడా తెలుసు. అందుకే, ఈ మధ్య కేసీఆర్ నల్గొండలో పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా, ఇప్పట్నుంచే కొన్ని వ్యూహాత్మక లీకులు ఇస్తున్నారని చెప్పుకోవాలి.
నిజానికి, 2014 ఎన్నికల్లోనే నల్గొండ జిల్లాలో తెరాస బోణీ కొట్టింది. ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలు దక్కించుకుని.. కాంగ్రెస్ కు మాంచి షాక్ ఇచ్చింది. అయితే, ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తోపాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి దెబ్బ తగిలినా… 2019 నాటి పరిస్థితి మరోలా ఉండొచ్చు. పరిస్థితులు కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్న విశ్లేషణల్ని కూడా మనం ఈ మధ్య వింటున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే నల్గొండపై తెరాస వ్యూహం ఏవిధంగా ఉండబోతోందన్నదానిపై తెరాస నుంచి కొన్ని లీకులు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి తెరాస తరఫున ఒక కీలక నాయకుడు కావాలన్న చర్చ తెరాస మొదలైందట! అయితే, ఇప్పుడు ఆ చర్చకు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే… ఆ కీలక నేత మరెవ్వరో కాదు.. కేసీఆరే..!
అవును, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. జిల్లా నుంచి తానే పోటీకి దిగడం వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుందనే భావనలో ఉన్నారట. ఈ లోగా నల్గొండలో తలపెట్టిన సాగు నీటి ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఉత్తర తెలంగాణలో ఎలాగూ తెరాసకు మంచి పట్టు ఉంది. 2009 నుంచే పాలమూరు ప్రాంతంపై బాగానే ఫోకస్ చేశారు. ఇక, మిగిలింది దక్షిణ తెలంగాణ. ఇక్కడ పార్టీ కాస్త వీక్ గా ఉందన్న విమర్శలున్నాయి. పైగా, కాంగ్రెస్ బలపడే ఛాన్స్ లు ఇక్కడి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో బోణీ చేసినా కూడా, వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి ఈ జిల్లా వెళ్లకుండా కట్టడి చేయాలంటే… తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.
అయితే, ముందుగానే ఇలాంటి లీక్స్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కి ఇప్పటి నుంచే టెన్షన్ పెంచొచ్చు అనుకుంటున్నారట! పైగా, లోకల్ తెరాస కేడర్ లో కూడా కొత్త జోష్ వస్తుందనీ, కేసీఆర్ తమ జిల్లా నుంచే పోటీ చేయడం అనేసరికి కార్యకర్తల పనితీరు వేరేలా ఉంటుందని ఆశిస్తున్నట్టు అర్థమౌతోంది.