చట్టం ప్రకారం.. జీఎస్టీ బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదని,, దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని గుర్తు చేశారు. చట్టం ప్రకారం రెండునెలలకోసారి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో తెలంగాణ ఆదాయం 83శాతం పడిపోయిందని… ఈ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని… వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని గుర్తు చేశారు. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ పరిణామాల నుంచి గట్టెక్కాల్సి వస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
జీఎస్టీ ఫలాలు దీర్ఘకాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి ఉపయోగపడతాయని అనుకున్నామని కానీ పరిస్థితి అలా లేదన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. జీఎస్టీ పరిహారం చెల్లించలేమని… రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం చెప్పడంపైనా కేసీఆర్ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్రానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు లేదని… ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అదనంగా సాయం చేయాల్సిన కేంద్రం.. నిధుల కోత విధించడం తగదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణం చెల్లించాలని కోరారు. కేంద్రం రుణం తీసుకుని రాష్ర్టాలకు పూర్తిగా పరిహారం ఇవ్వాలని కోరారు.
జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్స్‌ను కేసీఆర్ తిరస్కరించినట్లయింది. సోమవారం.. పది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో హరీష్ రావు భేటీ సందర్భంగా కూడా.. ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు అధికారికంగా కేసీఆర్… కేంద్రం ప్రతిపాదనల్ని తోసి పుచ్చారు. ఒక్క ఏపీ లాంటి రాష్ట్రం మినహా.. మిగతా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ… జీఎస్టీ పూర్తి పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాయి.