ఓ నాలుగు రోజుల కిందటే… కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందనీ, కేంద్రం నిర్లక్ష్యం వల్లనే తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని విమర్శించారు. కేంద్రంపై విమర్శలను ఆయన ప్రారంభిస్తే… ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ లేఖ కేంద్రానికి రాశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. ఒకవేళ పన్నుల వాటా విడుదల చేయలేని పరిస్థితి ఉంటే వాస్తవాలను వెల్లడించాలంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర వాటా నిధుల రాక గతం కంటే చాలా ఆలస్యమౌతోందన్నారు.
ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీన్లో ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే చర్చ జరిగింది. కేంద్రం నుంచి ఇంకా రావాల్సినవి ఎంత అనే లెక్కలు తేల్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ. 19,719 కోట్లు అనీ, ఈ మొత్తాన్ని ఇస్తామని కూడా కేంద్రం చెప్పిందనీ… గడచిన ఎనిమిది నెలల్లో కేవలం రూ. 10,304 కోట్లు మాత్రమే కేటాయించదని సమావేశంలో సీఎం చెప్పారు. ఇదే అంశాన్ని లేఖలో పేర్కొంటూ, కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్లనే రాష్ట్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరింత దారుణంగా మారుతుందన్నారు. ఆర్థిక మాంద్యం లేదంటూ కేంద్రం చెబుతున్న వాదనలో వాస్తవం లేదన్నారు. పార్లమెంటులో మంత్రులు చెబుతున్న పరిస్థితికీ, దేశంలో వాస్తవ పరిస్థితికీ చాలా తేడా ఉందన్నారు. ఇలాంటి పొంతన లేని మాటల వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని విమర్శించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ఆర్థికమంత్రిని కలుసుకుని వీటిని వివరిస్తానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రంపై విమర్శలను ప్రారంభించినట్టే కనిపిస్తోంది. గతంలో కూడా ఇలానే రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, విభజన అంశాలపై కేంద్రాన్ని చాలాసార్లు కోరారు. అయితే, అప్పట్లో ఈ విమర్శనాత్మక ధోరణి పెద్దగా కనిపించలేదు. వినతలు మాదిరిగానే డిమాండ్లు ఉండేవి. ఇప్పుడు ఆ స్వరంలో కొంత మార్పు వచ్చినట్టుగా, కేంద్ర వైఫల్యాలను ప్రశ్నించే రకంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడానికి ఓరకంగా కేంద్రమే కారణమనే అభిప్రాయ కలిగేలా ముఖ్యమంత్రి విమర్శలు ఉండటం విశేషం. ఈ లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తుందో? నిధుల దగ్గరకి వచ్చేసరికి కేంద్రం దగ్గర ఎప్పుడూ ఒక స్టాండర్డ్ సమాధానం ఉంటుందనుకొండి! ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఇచ్చాం, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకునే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నట్టుగా మాట్లాడతారు కదా! చూడాలి… కేసీఆర్ తాజా లేఖ నేపథ్యంలో ఏదైనా స్పందన ఉంటుందో లేదో?