తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా విషయంలో మొదటి వేవ్ విషయంలో ఎంత హడావుడి చేశారో ఇప్పటికీ కళ్ల ముందు ఉంది. కఠినమైన లాక్ డౌన్లు పెట్టి… బతికి ఉంటే బలుసాకు తినవచ్చని… లేకపోతే.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని.. లాజికల్‌గా చెప్పారు. అందరూ నిజమేననని అనుకుని ఆయన లాక్ డౌన్‌కు మద్దతు పలికారు. రెండో వేవ్ వచ్చేసరికి ఆయన వాయిస్ పూర్తిగా మారిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా.. ఆయన ఆర్థిక వ్యవస్థ గురించే ఆలోచిస్తున్నారు. ఆదాయం పడిపోతే.. ఎలా అని ఆవేదన చెందుతున్నారు. అందుకే లాక్ డౌన్ పెట్టాలని అనుకోవడం లేదు. అంతే కాదు.. లాక్ డౌన్ పెట్టకూడదనుకున్నారు కాబట్టి.. తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తెలంగాణలో అంతా బాగుందని సీఎస్ సోమేష్ కుమార్ రెండు రోజులకిందట ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఒక రోజు తర్వాత సీఎం కేసీఆర్.. వైద్య, ఆరోగ్య శాఖను తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత తొలి సారిగా సమీక్ష చేశారు. ఆ సమీక్షలోనూ ఇంచుమించుగా సీఎస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలనే చెప్పారు. లాక్ డౌన్ విధించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. నిజానికి తెలంగాణలో పరిస్థితి అంత మెరుగ్గా ఉందా.. కరోనా రోగులకు ఎలాంటి సమస్యలూ లేవా..? వైరస్ వ్యాప్తి లేదా..? అంటే.. ఎటు చూసినా భయమైన వాతావరణమే కనిపిస్తోంది. ఏ కట్టడి చర్యలు లేకుండానే వైరస్ ఎలా కట్టడి అవుతుందనేది.. ప్రతి వ్యక్తికి వచ్చే సందేహం.
కరోనా కట్టడికి అసలు దేశంలో ఏ చర్యలూ తీసుకోని రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉంది. నైట్ కర్ఫ్యూను పెట్టారు కానీ దాని వల్ల లాభం ఏమీ ఉండదని న్యాయస్థానాలే తేల్చాయి. పొరుగు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కానీ.. తెలంగాణలో మాత్రం లైట్ తీసుకున్నాయి. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోయినా.. ఆస్పత్రుల ముందు రోగులు అవస్థలు పడినా పెద్దగా బయటకు తెలియడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితిని కప్పి పుచ్చడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ పెడితే ఆర్థికంగా దెబ్బతింటామన్న కారణంతోనే.. అసలు తెలంగాణలో వైరస్ లేదని చెప్పడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నాడు బతికుంటే బలుసాకు అన్న వాదన తీసుకొచ్చిన కేసీఆరే.. టోటల్‌గా మారిపోయారు.