తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది.. గాంధీ ఆస్పత్రి సందర్శనకు వెళ్తే ఉండదా..!?. ఉంటుంది.. అందరూ ఆశ్చర్యంగా చెప్పుకునేలా తన గాంధీ ఆస్పత్రి పరిశీలన ప్రోగ్రాం పూర్తి చేశారు. దానికి కారణం ఆయన మాస్క్ మాత్రమే పెట్టుకున్నారు. పీపీఈ కిట్ల్లాంటివి ఏమీ ధరించలేదు.
కరోనా వార్డుల్లో కేసీఆర్ పీపీఈ కిట్లు వేసుకోకుండా.. తిరిగేశారు. ఐసీయూ రూముల్లోకి వెళ్లారు. ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న వారి దగ్గరకు వంగి.. వారు చెప్పే మాటలు విన్నారు. బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పారు.
వైద్యులు పీపీఈ కిట్ వేసుకోవాలని సూచనలు చేసినప్పటికీ.. కేసీఆర్ పట్టించుకోలేదు. గాంధీలో నిత్యం విధులు నిర్వహించే వైద్యులు.. కరోనా వార్డుల్లోకి పీపీఈ కిట్లతోనే వెళ్తారు. ఇలా వచ్చే వారందరూ పీపీఈ కిట్లలో వస్తే.. రోగులు భయపడతారని..మానసికంగా మరింత ఆందోళనకు గురవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే ముఖ్యమంత్రి కూడా అలాగే వెళ్తే …భరోసా లభించదు. ఈ విషయాన్ని ఆలోచించిన సీఎం కేసీఆర్… పీపీఈ కిట్ గురించి ఆలోచించలేదు. దీంతో అందరూ కేసీఆర్ తీరును ప్రశంసిస్తున్నారు. కరోనా భయం లేకుండా.. కేసీఆర్ కరోనా వార్డుల్లో తిరగడం.. సీరియస్‌గా ఉన్న పేషంట్లను సైతం పలకరించడం చాలా మందిని ఆకర్షించింది.
నిజానికి గత వారమే కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని పరిశీలించబోతున్నామని మీడియాకు సమాచారం వచ్చింది. కానీ అప్పట్లో కారణం తెలియకుండా ఆగిపోయారు.ఈ రోజు మాత్రం పెద్దగా హడావుడి లేకుండానే.. గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగారు. కరోనా చికిత్స వివరాలను తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో పరిశీలనకు వెళ్లడం ఇదే మొదటి సారి. కేసీఆర్ వెంట మంత్రి హరీష్‌రావుతో సీఎస్ సోమేష్‌కుమార్ ఉన్నారు.