అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అనీ వెనకటికి ఒక సామెత ఉంది. రాజకీయాల్లో అదే అవసరం! ఒక నాయకుడి మీద ఉన్న కోపాన్నో అసంతృప్తినో అధినేత నేరుగా వ్యక్తం చేస్తే అది రాజకీయం ఎందుకౌతుందీ..? ఇలాంటి ఎత్తులూ పైఎత్తుల విషయంలో సీఎం కేసీఆర్ చతురతకు తిరుగులేదనే ఇమేజ్ ఉంది కదా! ఇంతకీ జరిగింది ఏంటంటే… సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు, భవనాల శాఖకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామనీ, రహదారులను అందంగా తీర్చి దిద్దుదాం అనుకుంటే ఇంకా గుంతలు కనిపిస్తూనే ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి తాను పర్యటన చేస్తాననీ, రోడ్లపై ఎక్కడ గుంతలు కనిపించినా సహించేది లేదని ఆగ్రహించారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ జాతీయ రహదారులకు నిధులు సాధించుకున్నా ఇంత నిర్లక్ష్యమేంటీ అంటూ ఆ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది దుత్త మీద కోపం కాదు… అత్త మీద ఆగ్రహమే! రోడ్లు భవనాల శాఖపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారంటే.. ఆ శాఖ మంత్రి ఎవరూ, తుమ్మల నాగేశ్వరరావు! నిజానికి, తెరాసలో ఆయన ఎంతో కీలకంగా ఉంటున్నారు. మామూలుగానే ఆయన నోరు తెరిస్తే బూతులు! అయినాసరే, ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా కాస్త మంచి పేరే ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు రాళ్లెత్తకపోయినా, తెరాస అధికారంలోకి వచ్చాక మంత్రి అయిపోయారు.
తాజాగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆగ్రహించిన ఘటన తెలిసిందే. ఒకవైపు రాష్ట్రంలోని రైతాంగాన్ని విశేషంగా ఆకర్షించేందుకు కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తుంటే… ఖమ్మంలో రైతులు ఆగ్రహించడం అనేది తెరాసకు మచ్చే కదా. గిట్టుబాటు ధర రావడం లేదన్న బాధలో కొంతమంది రైతులు మిర్చియార్డుపై దాడి చేశారు. అది తుమ్మల ఇలాఖా కాబట్టి, పరిస్థితిని ముందుగా ఆయన అంచనా వేయలేకపోయారన్న అసంతృప్తి కేసీఆర్ లో కచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించారు కాబట్టే… నష్ట నివారణ చర్యలకు దిగారు తుమ్మల. దాడికి దిగింది రైతులు కాదనీ, రౌడీలనీ, రైతులైతే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని కూడా ఏదోలా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
మొత్తానికి, ఈ ఇష్యూ కేసీఆర్ కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే, రైతుల సమస్యల్నే ప్రధానాంశంగా చేసుకుని కాంగ్రెస్ బలపడే ప్రయత్నంలో ఉంది. సో.. దాన్ని దెబ్బతీయడం కోసం బడ్జెట్ లోగానీ, ఆ తరువాత ఉచిత ఎరువులంటూ వరాలు గానీ ఇచ్చారు. సరిగ్గా, ఇలాంటి తరుణంలో స్థానికంగా ఇంత జరుగుతూ ఉంటే తుమ్మల గుర్తించలేకపోయారనేది తెరాస వర్గాల అసంతృప్తి అనడంలో సందేహం లేదు. సో… దానిపై నేరుగా స్పందించడం, తుమ్మలను పిలిచి క్లాస్ తీసుకోవడం అనేది సాధ్యం అయి ఉండకపోవచ్చు. అందుకే, సమీక్ష సమావేశంలో తుమ్మలపై ఉన్న ఆ కోపాన్ని, గుంతల పేరుతో కేసీఆర్ బయటపెట్టారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.