హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలను టార్గెట్ చేసుకునే కేసీఆర్ అక్కడ ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఆ పథకం కింద నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసుకుని.. ఆయా కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున నగదు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని హూజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. అంద వరకూ బాగానేఉంది కానీ.. అక్కడ వంద మందికికాదు.. ప్రతి దళిత కుటుంబానికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం మీద దళిత కుటుంబాలు ఆరు వేల వరకూ ఉంటాయి.
వాటిలో ఓ వెయ్యి కుటుంబాలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా పరిగణించినా.. ఐదు వేల కుటుంబాలకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పథకం కోసం కేటాయించిన సొమ్ములో సగానికిపైగా వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలన్నింటినీ లెక్కించడానికి .. వారిలో అర్హుల్ని తేల్చడానికి ప్రత్యేకంగా వర్క్ షాప్ పెట్టాలని డిసైడయ్యారు. మామూలగా అయితే దళిత బంధు పథకం కింద.. ఒక్కకుటుంబానికి పది లక్షలు.. నియోజకవర్గం నుంచి వంద కుటుంబాలు. .. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 11900 కుటుంబాలకు లబ్ది… చేకూర్చాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు హూజరాబాద్లోనే ఐదు వేల కుటుంబాలకు ఇచ్చే ప్రణాళిక అమలు చేయబోతున్నారు.
అది పైలట్ ప్రాజెక్ట్ అని ప్రచారం చేయబోతున్నారు. ఈ రకంగా ఎన్నికలకు ముందే ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు పంపిణీ చేస్తే.. టీఆర్ఎస్కు తిరుగు ఉండదు. అయితే.. ఆ పథకాన్ని కేసీఆర్ మార్క్ లో అమలు చేస్తారని విపక్షాలు అనుమానిస్తున్నాయి. గ్రేటర్లో వరద సాయం తరహాలో కొంత మందికి ఇచ్చి.. మిగతా వారికి ఎన్నికల కోడ్ పేరుతో ఆశ పెడతారని.. తర్వాత హ్యాండిస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా రాజకీయంగా చర్చనీయాంశం కావడం ఖాయం.