ఎన్నికలంటే చాలు అధికార పార్టీ తెరాస మంచి దూకుడు మీద ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులోనే… ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికల్ని కూడా ముగించేద్దామని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిజానికి, సహాకర సంఘాల ఎన్నికలు చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. రెండేళ్ల కిందటే తెలంగాణలో జరగాల్సి ఉంది. కానీ, ఆరేసి నెలల చొప్పున మూడేళ్లపాటు పాలక వర్గాలను పొడిగించుకునే అవకాశం సహాకర చట్టంలో ఉంది. దీన్ని వాడుకుంటూ ఇన్నాళ్లూ వాటిని పొడిగించుకుంటూ వచ్చారు. వరుస గెలుపు ఊపులో తెరాస ఉంది కాబట్టి, ఈ ఎన్నికల్లో కూడా దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. అయితే, ఈ ఎన్నికల నిర్వహణకు ఉన్న కొన్ని అడ్డంకుల్ని అధిగమించడం కోసం ఏకంగా కొత్త విధానాన్నే సీఎం కేసీఆర్ తెర మీదికి తెస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత జిల్లాల విభజన జరిగిందిగానీ, దాని ప్రకారం డీసీసీబీల విభజన జరగలేదు. ఎన్నికల నిర్వహణకు ఇదే ఇన్నాళ్లూ ఒక అడ్డంకిగా వచ్చిందని చెప్పొచ్చు. కొత్త జిల్లాల ప్రకారం డీసీసీబీల విభజన జరగాలంటే ఆర్బీఐ అనుమతి కావాలి. అయితే, ఆర్బీఐ స్పందన కోసం ప్రభుత్వం ఎదురుచూపులే తప్ప, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడున్న పద్ధతిన కాకుండా, కొత్త విధానం తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఆలోచనలో ఉన్న ఆ కొత్త విధానం ఏంటంటే… జిల్లా స్థాయిలో డీసీసీబీ ఛైర్మన్ల వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనతో ప్రభుత్వం ఉందట. ఆ స్థానంలో జిల్లాలవారీగా ఒక డైరెక్టర్ ని ఎన్నుకుంటారు. ఇలా జిల్లాలవారీగా ఎన్నికైన డైరెక్టర్లంతా కలిసి, రాష్ట్రస్థాయిలో ఛైర్మన్ ని ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఈ వ్యూహానికి తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రస్తుతం సహాకార సొసైటీల ఛైర్మన్ల ఎన్నిక మాత్రమే జరుగుతుంది. గతంలో అయితే వీరంతా డీసీసీబీ ఛైర్మన్ ను ఎన్నుకునేవారు. కానీ, ఈ ప్రక్రియను ప్రస్తుతానికి ఆపారు. అంటే, కొత్త విధానం ప్రకారం డైరెక్టర్ ని ఎన్నుకునే పద్ధతిని తెరమీదికి తేవాలని భావిస్తున్నట్టే లెక్క. అందుకే, ఈ డైరెక్టర్ల ఎన్నికకు కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు. ఆర్బీఐ నుంచి స్పందన రాకపోవడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధానాన్ని తెర మీదికి తెచ్చారని సమాచారం. అయితే, ఈ కొత్త ప్రక్రియపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమౌతాయేమో చూడాలి.