ఆగస్టు పదిహేను తర్వాత అసలు పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. దానిపై చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ పాలన చేసింది కేసీఆర్ కాదా.. అని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. అయితే కేసీఆర్ అవన్నీ పట్టించుకునే రకం కాదు. కానీ ప్రజల్లో మాత్రం.. ఇప్పుడు.. కేసీఆర్ మార్క్ పాలన ఎప్పటి నుండి అనే చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ మార్క్ పాలనంటే ఏం చేస్తారనే సందేహం కూడా చాలా మందిలో వస్తోంది.
చట్టాల బూజు దులిపి ప్రజాజీవితాన్ని మెరుగు పరుస్తున్నామని ఆగస్టు పదిహేను వేడుకల్లో కేసీఆర్ ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రధానంగా మూడు చట్టాలపై దృష్టి పెట్టారు. కొత్త రెవిన్యూ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం.. కొత్త మున్సిపల్ చట్టం. వీటిలో తెచ్చే విప్లవాత్మక మార్పులతో… ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ఆయన నమ్ముతున్నారు. మూడు చట్టాలను సమర్ధంగా అమలు చేస్తే పాలనలో వేగం, అవినీతి నిర్మూలన, పారదర్శకత వస్తుందని నమ్ముతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తారు. ఈ మూడు చట్టాలను కఠినంగా అమలు చేస్తే తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని నమ్ముతున్నారు.
కేసుల కారణంగా మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న సమయానికి జరగలేదు. ఈ నెలాఖరులోగా తీర్పు వచ్చినా ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కన్పించడం లేదు. కోర్టుల్లో కేసులు.. వరుస పండగలు.. బడ్జెట్ సమావేశాలు ఇతర కారణాల వల్ల నవంబర్ లోనే మున్సిపల్ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ.. కొత్త చట్టాల అమలు విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించారు. కొత్త చట్టాలు అమలు చేయడం కొత్త గవర్నెన్స్ లో భాగమని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. అందుకే కేసీఆర్ చెప్పిన తన మార్క్ పాలన కోసం.. ప్రజలు కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు.