తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత తనదైన మార్క్ స్పీచ్ ఇచ్చారు. ఓ వైపు వరాలు.. మరో వైపు ప్రత్యర్థులపై మాటల తూటాలు.. అనర్ఘళంగా ఆయన ప్రసంగం .. నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో సాగిపోయింది. ఉపఎన్నికల షెడ్యూల్ ఎ క్షణమైన వచ్చే అవకాశం ఉండటంతో ఆ నియోజకవర్గంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో… ముందుగా వరాల వర్షం కురిపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 800కిపైగా పంచాయతీలు ఉన్నాయని లెక్క చెప్పిన సీఎం.. ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమే… తర్వాత మండల కేంద్రాలకు రూ. 30 లక్షలు, నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 5 కోట్లు, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం రూ.186 కోట్లు ప్రకటించారు. రూ. 2,500 కోట్లతో లిఫ్ట్ స్కీం మంజూరు చేస్తున్నామని లిఫ్ట్‌లు పూర్తి చేసి అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సవాల్ చేశారు. కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న విమర్శలకూ చెక్ పెట్టారు. అర్హులకు కొత్త పెన్షన్లు .. ప్రతి గ్రామంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వరాల ప్రకటన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్లు మాట్లాడుతున్నారని.. .వాళ్లలా మాట్లాడాలంటే మాకు చేతకాక కాదని తేల్చేశారు. అయితే మేం తలుచుకుంటే మీరు మిగలరని ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసన్నారు. అధికారాన్ని ప్రజలు ఇచ్చారు కానీ.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదని తేల్చారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండటంతో ఈ సారి కాంగ్రెస్ పైనా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్సేనన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలని చరిత్రను కూడా చెప్పారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు.. మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా అని ప్రశ్నించారు.
రాజకీయ ప్రసంగాలు అంటే కేసీఆర్ చాలా దూకుడుగా ఉంటారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో… కేసీఆర్ స్పీచ్‌ని బట్టి అర్థమైపోతుంది. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చెప్పేవి అబద్దమైతే… టీఆర్ఎస్ను ఓడించాలని ఓటర్లకు ఆఫర్ ఇచ్చారు. అదే నిజం అయితే ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు లేకుండా చేయాలన్నారు. ఆయన షర్మిల పెట్టాలనుకున్న పార్టీని పరిగణనలోకి తీసుకున్నట్లుగా లేరు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.