ఒక్కకుటుంబానికి పది లక్షలు.. నియోజకవర్గం నుంచి వంద కుటుంబాలు. .. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 11900 కుటుంబాలు. ఇదీ దళిత ఎంపవర్మెంట్ పథకంపై సీఎం రోజంతా సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం. అందరికీ కలిపి పన్నెండు వందల కోట్లను డైరక్ట్‌గా ఎకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. లబ్దిదారుల ఎంపికను చేపట్టి.. హుజూరాబాద్ ఎన్నికలకు ముందే ఈ పంపిణీ పూర్తి చేయనున్నారు. ఆర్థికంగా బాగా చితికిపోయిన దళిత కుటుంబాలను.. ఉన్నత స్థాయికితీసుకొచ్చే లక్ష్యంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ సొమ్ము వారి అభివృద్ధికి ఉపయోగపడేలా చేయనున్నారు.
ఒక్క కుటుంబానికి రూ. పది లక్షలు అంటే చిన్న సాయమేమీ కాదు. పైగా ఇది.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు అదనం. అదనంగా ఏర్పాటు చేసిన పథకంలో భాగంగా నిధులు కేటాయించి.. పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రభుత్వాలు… రెగ్యులర్‌గా అమలు చేస్తున్న పథకాలనే సబ్ ప్లాన్ నిధుల కింద చూపిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం దళితులను మోసం చేస్తున్నారన్న విమర్శలు రాకుండా వీలైనత మందికి నగదు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఆయన ప్రకటించిన పథకం.. లబ్దిదారుల్లో సంతోషం నింపడమే కాదు.. కేసీఆర్ ఆశించే రాజకీయ ప్రయోజనాలు కూడా.. తెచ్చి పెట్టే అవకాశం ఉంది.
నియోజకవర్గానికి వంద కుటుంబాలనే ఎంపిక చేయడం… ఇప్పుడు అసలు సవాల్. ఎందుకంటే.. కొన్ని వేల దళిత కుటుంబాలు.. దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఓ వంద మందికి ఇచ్చి.. మరో వంద మందికి వచ్చే ఏడాది ఇస్తామంటే.. మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే ప్రమాద ఉంది. ఇలాంటి సమస్యలను కేసీఆర్ పరిష్కరించాల్సి ఉంది. దళితుల అభ్యున్నతి కోసం… తీసుకుంటున్న చర్యలకు తోడు..నేరుగా డబ్బుల పంపిణీ చేయడం. .. చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఇలాగే ఉంటాయని.. కొంత మంది ప్రశంసిస్తున్నారు. ప్రజాధనంతో రాజకీయం చేస్తున్నారని మరికొంత మంది విమర్శిస్తున్నారు.