ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఆగ్రహిస్తారు, ఎప్పుడు అనుగ్రహిస్తారో అర్థంకాని పరిస్థితి! యాదాద్రి పనులను సీఎం స్వయంగా పర్యటించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఏమన్నారు… అస్సలు తొందర్లేదు, మెల్లగా పనులు కానీయండని అధికారులకు చెప్పారు. ఆలయాలను పునరుద్ధరించాలంటే డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయకూడదన్నారు! ఆలయ ప్రాశస్యం, గర్భగుడి ఆకారం చెక్కు చెదరకుండా ఉండాలంటే నిదానంగానే ఇలాంటి పనులు చేయాలన్నారు. ఇది సనాతన ధర్మం, స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు, వారికి అన్ని సదుపాయాలూ ఏర్పాటు చెయ్యాలి, ఇవన్నీ తొందరపడితే జరిగేవి కాదు, నిదానంగా జరగాల్సినవే… అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
ఇదే ముఖ్యమంత్రి గడచిన ఆగస్టు నెలలో కూడా ఇలానే యాదాద్రి పర్యటనకు వచ్చారు. అప్పుడేమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే… ఏమయ్యా, ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మరో ఐదేళ్లు సరిపోతాయా, ఇంకా చాలవా అంటూ అధికారులపై ఒక రేంజిలో కస్సుమని లేచారు. పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో మీకైనా స్పష్టత ఉండాలి కదా అని కోప్పడ్డారు! అవసరమైతే ఒక ప్రత్యేక అధికారిని పెట్టండి, కావాల్సిన నిధులు అడిగి తీసుకొండి, పనులు మాత్రం వేగంగా జరగాలె, త్వరలో పెద్ద ఎత్తున పూజలు పెట్టుకున్నాం, ప్రపంచదేశాల నుంచి లక్షలమంది ఇక్కడికి వస్తారంటూ క్లాస్ తీసేసుకున్నారు.
మరేంటీ అప్పుడంత ఆగ్రహించేసి, ఇప్పుడేమో మెల్లగైనా ఫర్వాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? అప్పటికీ ఇప్పటికీ ఒకటే సమస్య… నిధులు. ఆగస్టులో రూ. 473 కోట్లు ప్రతిపాదనల్ని పంపినట్టు సీఎంకి అధికారులు చెప్పారు. ఇంతవరకూ వాటిలో ఎంత విడుదల చేసిందో ఆర్థిక శాఖ స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి, పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది! కేసీఆర్ ప్రస్తుత అనూహ్య శాంతముద్ర వెనక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది. ఏడాది పాలనలో సాధించిందేం లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంకెన్నాళ్లు కావాలయ్యా అంటూ అధికారుల మీద గతంలో మాదిరిగా ఇప్పుడూ ఎద్దేవా చేస్తే… నిధులు ఇవ్వలేదు సార్ అని అన్నారే అనుకోండి, ఏమౌతుంది? యాదాద్రి పునర్నిర్మాణం నీరుగారుతోందని ప్రతిపక్షాలు విమర్శించేలోపు… ఇలాంటి పనులు మెల్లగానే సాగాలె అనే ఓ సిద్ధాంతాన్ని తయారు చేశారు కేసీఆర్! నత్త నడకన సాగుతున్న పనుల్ని అధికార పార్టీ వైఫల్యం అనే చర్చ తెర మీదికి వచ్చేలోపు… ఆలయ నిర్మాణాలంటే అంతే, మెల్లగానే, జాగ్రత్తగా సాగాలి అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నంగా కనిపిస్తోంది.