వర్షా కాలం వస్తోంది. వచ్చే వరదను ఒడిసి పట్టి.. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ ప్రణాళికపై ఆదివారం గోదావరి తీర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఇరిగేషన్ శాఖాధికారులతో సమావేశమవుతున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో కృష్ణా తీర ప్రాంత మంత్రులతోనూ సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో నీటి వినియోగ విధానం తయారు చేయనున్నారు. ఏ పంటకు, ఏ ప్రాంతానికి, ఎప్పుడు, ఎంత నీరు విడుదల చేయాలనే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసే యోచనలో ఉన్నారు.
తెలంగాణాలో జలాల వినియోగానికి ప్రణాళిక రూపొందిస్తున్న సందర్భంగా కృష్ణా జలాల అంశం చర్చనీయాంశం అవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి ఏపీ ప్రభుత్వం అదనంగా నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 203 జీఓ కింద పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీనిపై తెలంగాణాలో చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓపై తెలంగాణా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని టిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడలేదు.
ఈ వివాదం నేపధ్యంలో కృష్ణా, గోదావరి తీర ప్రాంత మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 203 పై కేసీఆర్ ఎలా స్పందిస్తారోనన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి జల వివాదాల్లో కేసీఆర్ దారుణమైన భాషతో విరుచుకుపడతారు. ఈ సారి కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఉంది. అయితే.. కేసీఆర్ ఈ సారి మాటల్లో కాదని… తెలంగాణ నుంచి దిగువకు వెళ్తేనే నీరు వెళ్తుందని.. పైనే ఆపేస్తే.. ఏం చేస్తారనే… విధానంతో సమాధానం చెబుతారని.. టీఆర్ఎస్ వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి.