టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం చేసినా దానికి పక్కా రాజకీయ కొలతలు ఉంటాయి. కొద్ది రోజులుగా బీజేపీపై.. నరేంద్రమోడీపై విరుచుకుపడుతున్నారు. ఆయన ఆరోపణలు చేస్తున్నవి కొత్త అంశాలేమీ కాదు . కానీ కొత్తగా చేస్తున్నారు. దీంతో ఏదో పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందన్న అభిప్రాయానికి వస్తున్నారు. జిల్లాల పర్యటనలు కూడా మళ్లీ ప్రారంభించారు. తెలంగాణ ప్రగతి మీ కళ్ల ముందే ఉందంటున్నారు. రైతుల్ని ఆకట్టుకునేందుకు మీటర్లు పెట్టబోనని .. అవసరమైన ప్రాణం ఇస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. రైతుల్ని కాపాడుకుంటానంటున్నారు.
కేసీఆర్ రాజకీయ డైలాగులు విన్న వారికి ఖచ్చితంగా ఎన్నిక సందడి దగ్గరకు రాబోతోందని నమ్ముతున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లుగా గత ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో టీఆర్ఎస్ క్యాంప్ నుంచే కొన్ని లీకులు మీడియాకు వచ్చాయి. తర్వాత ముందస్తు ఉండదని పార్టీ నేతల కార్యవర్గ సమావేశంలో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే అనుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు ముందస్తు ఖాయమని నమ్ముతున్నారు . విపక్షాల్లోనూ అదే నమ్మకం ఉంది.
ఇటీవలే పీకే టీంను రంగంలోకి దింపిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిపై సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది. రెండో విడత అధికారంలో ఉన్నందున పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది కానీ మెరుగుపడే పరిస్థితి లేదని ఉన్నంతలో ప్రత్యేకవ్యూహాలతో ఒకటి, రెండు టాపిక్స్‌ను హైలెట్ చేసి ప్రజల భావోద్వాగాలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లి ఆ టాపిక్స్ మీద ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని పీకే నివేదికలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు మీటర్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు దళిత బంధును కూడా హైలెట్ చేసుకుని బడ్జెట్లో రూ. ఇరవై వేల కోట్లు కేటాయించి… అమలు ప్రారంభించి ఆగస్టు తర్వాత ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే రాజకీయ మేధావులు ఇదే ట్రాక్‌లో కేసీఆర్ నడుస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు.