తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడటం లేదు. కానీ వారిని ఆత్మరక్షణలో పడేయడంలో .. వారిలో వారు కలహాలు పెట్టుకునేలా చేయడంలో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటిపైనా అదే ప్రయోగం చేస్తున్నారు . వారి వ్యూహంలో ఇతర పార్టీలు చాలా తేలికగా చిక్కుకుంటున్నాయి. ఢిల్లీలో వారం రోజులు ఉన్న కేసీఆర్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యారు. కానీ వారం రోజులు అక్కడే ఉండటంతో తెలంగాణలో రకరకాల చర్చలు జరిగాయి. ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పుకున్నారు. ఇది బీజేపీ నేతల్ని ఆత్మరక్షణలో పడేసింది. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర సీరియస్ నెస్‌పై ఈ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఏర్పడింది. ఆయన పాదయాత్రకు వచ్చి విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రుల కంటే… అధికారిక కార్యక్రమాలకు వచ్చి టీఆర్ఎస్ సర్కార్ పై పొగడ్తలు కురిపిస్తున్న ఇతర కేంద్ర పెద్దల వల్ల కూడా బీజేపీకి చిక్కులు వస్తున్నాయి.
అదే వ్యూహాన్ని కేసీఆర్ కాంగ్రెస్‌పైనా ప్రయోగిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను దళిత బంధు మీటింగ్‌కు మరోసారి ఆహ్వానించారు. ఆయన నియోజకవర్గంలోని ఓ మండలంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించడంతో ఆయన హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలా నిర్ణయించుకునే ముందు రేవంత్ వ్యతిరేక వర్గం అంతా భేటీ అయింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో గందరగోళం ఏర్పడింది. దళిత బంధును పచ్చి మోసంగా చెబుతూ దళిత, గిరిజన దండోరాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పథకం పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావడం ఏమిటన్న అనుమానం సామాన్యుల్లో ప్రారంభమైంది.
ఇప్పుడు కాంగ్రెస్‌లోనే కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారన్న చర్చ కూడా ప్రారంభమయింది. కేవలం సమావేశాల ద్వారానే కేసీఆర్ రెండు పార్టీల్లోనూ గందరగోళం సృష్టించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. దీనికి ఆయా పార్టీల అంతర్గత ఆధిపత్య పోరాటాలు కూడా సహకరించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భట్టి విక్రమార్క మీటింగ్‌కు వెళ్లకతే పార్టీ అంతా ఏక తాటిపైన ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.