భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు రాని ఆయన ఇప్పుడు పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 19వ తేదీన తెలంగాణ భవన్ కు రావాలని కార్యవర్గ సభ్యులందరికీ సమాచారం పంపారు. పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని కిలక నిర్ణయాలను ప్రకటించే ముందు కేసీఆర్ ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఈ కారణంగా బీజేపీని గెలిపించడానికే ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో .. ఆ ప్రచారం ఉధృతంగా జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. దీనికి చెక్ పెట్టడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో పాటు బీజేపీపై కూడా ఈ సమావేశంలో విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే కార్యకవర్గ సమావేశాల్లో మాట్లాడిన విషయాలు బయటకు వస్తాయి కానీ.. ఎప్పుడూ రికార్డెడ్ గా బయటకు రావు. రికార్డు చేస్తారో లేదో స్పష్టత ఉండదు.
ఇటీవల వారానికో సారి అయినా పార్టీ నేతలను కలుస్తున్నారు. అప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తన్నారు. త్వరలోనే వస్తానని బహిరంగసభ జరుపకుందామని చెబుతున్నారు. గజ్వేల్ లో బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల ప్రకటన వస్తే అలాంటి సభ పెట్టాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తేదీలు ప్రకటించలేదు. విస్తృత సమావేశం తర్వాత కేసీఆర్ ఇక రెగ్యులర్ సమావేశాల్లో పాల్గొంటారా..లేకపోతే మళ్లీ ఫామ్ హౌస్కు వెళ్తారా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయించుకునే అవకాశం ఉంది.