తెలంగాణ ప్రజలకు కైలాసం ఆడితే పెద్దపాము మింగేసినట్లుగా పరిస్థితి మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కొంత మంది ముస్లిం నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. కైలాసం అంటే వైకుంఠపాళి అనే ఆటగా భావించవచ్ుచ. అందులో బాగా ఉన్నప్పుడు పెద్దపాము మింగితే మళ్లీ మొదటి స్థానానికి వస్తారు. తాము ఉన్నప్పుడు చాలా పై స్థాయిలో ఉన్నారని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కిందిస్థాయిలో ఉన్నారని చెప్పడం కేసీఆర్ ఉద్దేశం కావొచ్చు.
కరోనా అప్పుడు కూడా తాము రైతు బంధు ఆపలేదని .. రైతు బీమా ఎన్నో రైతు కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. ఒక్క పథకమూ సరిగ్గా అందడం లేదని.. అన్నీ గంగలో కలిసిపోయాయని మండిపడ్డారు. ఏమైనా అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మళ్లీ కరవు వచ్చిందన్నారు. మంచి నీటి సమస్య కూడా వచ్చిందని ఇక ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పాలనకు దండయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పనితీరును..మౌనంగా, గంభీరంగా పరిశీలిస్తున్నానన్నారు. కొడితే మాములుగా కొట్టను.. గట్టిగా కొడతామన్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయడం లేదని.. అన్ని ప్రాజెక్టులను పడుకోబెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు.