తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి ఇరవై రోజులకోసారి కార్యవర్గ సమావేశామో.. మరకటో పెట్టి సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఖాయం అని చెబుతూ వస్తున్నారు. కానీ సిట్టింగ్‌లలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఇదో పెద్ద ట్రాప్ అని అనుమానిస్తున్నారు. కనీసం ముఫ్పై మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఉండవేమో అని అనుమానిస్తున్నారు.అయితే టిక్కెట్ లేదనే సంకేతాలు రాకపోతూండటంతో.. తదుపరి ఏం చేయాలా అని వారు తేల్చుకోలేకపోతున్నారు.
గత ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇచ్చారు. ముగ్గురికి మాత్రమే నిరాకరించారు. నిజానికి అప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలకు ఎదురైన వ్యతిరేకతపై విస్తృతమైన ప్రచారాలు జరిగాయి. కానీ అనూహ్యంగా అలాంటి వారు చాలా మంది గెలిచారు. కానీ ఇప్పుడు ఆ వ్యతిరేకత భరించలేనంతగా పెరిగిందని.. ఇప్పుడు మళ్లీ వారికి టిక్కెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని బీఆర్ఎస్ పెద్దలు ఓ అంచనాకు వచ్చారని అంటున్నారు.
ముందస్తు ఎన్నికల కోసం సన్నాహలు చేసుకున్న కేసీఆర్ గతంలోనే టిక్కెట్లపై కసరత్తు కూడా పూర్తి చేశారని చెబుతున్నారు. నాలుగైదు ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించుకుని టిక్కెట్ల జాబితా రెడీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఎవరెవరికి టిక్కెట్లు గల్లంతు అన్నది మాత్రం బయటకు రానివ్వలేదు. అలా వచ్చిన వెంటనే వారిని తమ పార్టీల్లోకి లాక్కోడానికి బీజేపీ, కాంగ్రెస్ రెడీగా ఉంటాయి. వారికి ఆ చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కనీసం లీకులు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా చెబుతున్నారు.
ఖచ్చితంగా మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మరో రెండు, మూడు నెలల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. అప్పటికి అందర్నీ ఓ దారికి తెచ్చే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నట్లుగా గుసగసులు వినిపిసిస్తున్నాయి.