ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఆదివారం ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా అమిత్ షా ఇంటికి వెళ్లారు. అక్కడ గంటన్నర సేపు చర్చలు జరిపారు. చర్చల ఎజెండా ఏమిటో స్పష్టత లేదు. మళ్లీ సోమవారం ఉదయం పలువురు కేంద్రమంత్రులను కలిసిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ అమిత్ షా ఇంటికి వెళ్లారు. గంటన్నర సేపు వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
ఇలా రోజు మార్చి రోజు అమిత్ షాతో సమావేశం అయి చర్చించాల్సినంత అత్యంత ముఖ్యమైన విషయాలేమిటన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ప్రభుత్వ పరంగా తెలంగాణ అంశాలు చర్చించారన్న విషయాన్నీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా కేసీఆర్ ఇలాంటి భేటీలు నిర్వహించారంటే ఏదో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. కేసీఆర్ ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో అమల్లో పెట్టే వరకూ బయటకు తెలియనివ్వరు.
అమిత్ షాతో అలా చర్చలు జరుపుతున్నారంటే.. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మలుపులు కనిపించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదేమిటో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు టీఆర్ఎస్ వైపు నుంచి కాని స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ పరమైన విషయాలు మాత్రం ఇలా మాట్లాడే అవకాశం లేదని.. ఖచ్చితంగా రాజకీయమేనన్న అంచనా మాత్రం గట్టిగా ఉంది.