తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఇతర సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు వగైరాల గురించి వివరించి తక్షణమే కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. వారి సమావేశం సుమారు గంటన్నర సేపు సాగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో అంతసేపు సమావేశం అవ్వరు. ఆయనకు చాలా సన్నిహితుడయిన చంద్రబాబు నాయుడుతో కూడా అయన అంతసేపు సమావేశం అయిన దాఖలాలు లేవు కానీ కేసీఆర్ తో గంటన్నర సమావేశం అవడం అంటే కేసీఆర్ కి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రాదేయపడినా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ రాష్ట్రానికి బారీగా నిధులు విడుదల చేయలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్లుగా తక్షణమే తెలంగాణాకి నిధులు విడుదల చేసినట్లయితే, అది తెలంగాణాలో కొత్త రాజకీయ సమీకరణాలకు తొలి సంకేతంగా భావించవచ్చు.
తెలంగాణాలో తెదేపా, భాజపాలు తెగతెంపులు చేసుకొన్నట్లుగా అధికారికంగా ఇంకా ప్రకటించుకోకపోయినా దాదాపు అలాగే వ్యవహరిస్తున్నాయి. తెలంగాణాలో తెరాస ధాటికి భాజపా కూడా విలవిలాడుతోంది. కనుక దానిని కేసీఆర్ బారి నుంచి కాపాడుకోవాలంటే, తెరాసతో పొత్తులు పెట్టుకోవడమో లేక కేసీఆర్ దాని జోలికి రాకుండా చేయడమో తప్పనిసరి.
తెలంగాణాలో తెదేపా ఎలాగూ దూరం అయ్యింది కనుక తెరాస చేతులు కలిపినా దాని వలన ఆంధ్రాలో తెదేపా-భాజపాలపై ప్రభావం పడే అవకాశం లేదిప్పుడు. ఒకవేళ పడినా ఆ రెండు పార్టీలు ఎలాగూ తెగతెంపులకి సిద్దంగానే ఉన్నాయి కనుక తెరాసతో చేతులు కలపడానికి భాజపా సంకోచించనవసరం లేదు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తెరాస, భాజపాలు బయటపడకపోయినా, ఇకపై వాటి వ్యవహార శైలిని బట్టి అవి చేతులు కలపడానికి సిద్దం అవుతున్నాయో లేదో ఊహించవచ్చు.