తమిళనాడులోని శ్రీరంగం పర్యటనకు కుటుంబసమేతంగా వెళ్లిన కేసీఆర్ భక్తితో దేవుడ్ని దర్శించుకున్నారు. పనిలో పనిగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మంగళవారం భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం చెన్నైలోనే బస చేశారు. మంగళవారం స్టాలిన్‌తో అపాయింట్మెంట్ ఖరారైంది. నిజానికి ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుని ఆయన చెన్నైకు వచ్చారని తెలంగాణ రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఒక రోజు ముందుగా దేవుడి దర్శనం కోసం అని వచ్చారు కానీ.. నిజంగా స్టాలిన్‌తో భేటీ కోసమేనని అంటున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ గట్టిగా ఉంటున్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ కూటమిలో కూడా ఉన్నారు. ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష కూటమి సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ కూటమి దిశగా కదులుతున్నారా అన్న చర్చ ప్రారంభమయింది.కేంద్రంపై పోరాటం విషయంలో చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ నుంచి స్టాలిన్ నివాసానికి వెళ్లి కేసీఆర్ సమావేశం అవుతారు.
అంతర్గతంగా ఏం చర్చించారన్నది బయటకు రాదు కానీ.., వారు చెప్పేఅంశాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీపై పోరుబాటేనని అంచనా వేయవచ్చు. అయితే గతంలో అనేక అంశాల్లో పోరాటం చేద్దామని రమ్మని చెప్పి స్టాలిన్ లేఖలు రాశారు. వాటిపై కేసీఆర్ అసలు స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా ధాన్యంతో పాటు ఇతర రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశాలపై పోరాడదామని స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించబోతున్నారు. దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.