తెలంగాణలో జిల్లాల సంఖ్యను దసరా నాటికి పెంచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగాలని భావిస్తున్నారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఓ రోడ్ మ్యాప్ ను తయారు చేశారు.
ఇప్పుడున్న 10 జిల్లాలకు అదనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాలని, లేదు 20 జిల్లాలు అవసరమని కలెక్టర్ల సమావేశంలో అభిప్రాయాలు వినిపించాయి. హైదరాబాద్ ను విడగొట్టి సికింద్రాబాద్ జిల్లా చేయాలనే ప్రతిపాదన వచ్చింది. మొత్తం మీద 23 జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అయితే, చివరకు 24 జిల్లాలు ఖాయం కావచ్చని తెలుస్తోంది.
రెండురోజుల వర్క్ షాపులో స్థూలంగా ఓ అవగాహనకు వచ్చారు. ఈనెల 20న మరోసారి కలెక్టర్లతో భేటీ అవుతారు. ఆలోగా కలెక్టర్లందరూ నివేదికలను పంపాలని ఆదేశించారు. ఆగస్టు 4 నుంచి 10 వ తేదీ మధ్యలో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు సమయం ఉంటుంది.
జిల్లాల విభజనపై అఖిలపక్ష సమావేశం కూడా జరపబోతున్నారు. జులై 10 లేదా 11న ఈ భేటీ జరుగుతుంది. అందులో ప్రతిపక్షాలు సూచనలు చేయవచ్చు. వాటిని కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
మండలంలో 50 నుంచి 60 వేల జనాభా ఉండేలాచూడాలి. కాస్త అటూ ఇటుగా 20 మండలాలకు ఓ జిల్లా ఏర్పాటయ్యేలా ప్రతిపాదనలను కలెక్టర్లు పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 11వ తేదీన విజయదశమి నాడు కొత్త జిల్లా ఆవిర్భావం జరుగుతుంది.
తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచాలని రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచీ కేసీఆర్ చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనిపై కసరత్తు మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లాను రెండు నుంచి మూడు జిల్లాలుగా విభజిస్తారని వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి జిల్లా ఏర్పాటు ఖాయమని తాజాగా వార్తవు వస్తున్నాయి.
జిల్లా ఏర్పాటు కోసం ఇప్పటికే పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ముసాయిదాలు తయారైన తర్వాత అభ్యంతరాలు రావడం అనివార్యం. తమకు అనువుగాని జిల్లాలో విలీనం చేస్తున్నారంటూ నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది. అందుకే, బలవంతంగా విలీనం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలగని విధంగా ప్రతిపాదనలు చేయాలని కలెక్లర్లను కేసీఆర్ ఆదేశించారు.
మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన అవసరం లేని విధంగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుంది. అంతే గానీ కొన్ని గ్రామాలు ఒక జిల్లాలో, మరికొన్ని మరో జిల్లాలో ఉండే అవకాశమే లేదు. ఇంతకీ విజయదశమి నాడు 30 జిల్లాలను ప్రకటిస్తారో లేక 23 నుంచి 24 కు పరిమితం చేస్తారో చూడాలి.