జిల్లాల పర్యటనల్లో జాతీయ రాజకీయాల గురించి ప్రకటనలు చేస్తున్న కేసీఆర్ ఫ్రంట్ కట్టబోతున్నారా..? పార్టీ పెట్టబోతున్నారా ? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఓ వైపు జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఇతర పార్టీలను కలిసి కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అన్నింటికంటే ముందే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది.
అందుకే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినా కేసీఆర్ చేస్తోంది రాష్ట్ర రాజకీయాలేనని చెబుతున్నారు. రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరన్న కారణంగా ముందు సొంత ఇంటిని చక్క దిద్దుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత ధీమాగా ఉన్నా.. టీఆర్ఎస్ పరిస్థితి మరీ అంత మెరుగ్గా ఏమీ లేదని.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి తాము గెలుస్తామని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నాయి. కానీ పరిస్థితి ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది
పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు రానున్నాయి. తెలంగాణలో మూడో సారి పార్టీని అధికారంలోకి తేవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దానికి బీజేపీని సానుగా చూపుతారా.. టీడీపీనా అన్నది ఆయన రాజకీయ వ్యూహం. ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఆయన జాతీయ పార్టీ గురించి కార్యాచరణలోకి దిగుతారని అంటున్నారు ఈ జాతీయ పార్టీ అంశమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ను బలపరిస్తే.. తెలంగాణ బిడ్డ ఢిల్లీలో చక్రం తిప్పుతారని .. ఓడిస్తే తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వస్తుందని కేసీఆర్ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉందంటున్నారు.