తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దసరాకు జాతీయ పార్టీని లాంఛనంగా ప్రకటించబోతున్నారు. అయితే అసలు ఢిల్లీ రాజకీయాలు మాత్రం డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పార్టీ అధ్యక్షులు, మంత్రులతో ప్రగతి భవన్లో చర్చించిన కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో కొన్ని కీలక విషయాలను వారితో చర్చించారు. ఈ ప్రకారం డిసెంబర్ 9 వ తేదీన ఢిల్లీ నడిబొడ్డున భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ ఆరో తేదీన జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పార్టీ ప్రతినిధుల్ని ఢిల్లీకి పంపనున్నారు.
జాతీయ రాజకీయాల కోసం ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పార్టీని అధికారికంగా ప్రకటించే లోపు కావాల్సిన హైప్ క్రియేట్ చేసుకునేందుకు ఏర్పాట్లుచేశారు. మీడియా లో ప్రచారం కోసం పక్కా ప్రణాళిక ఏర్పాటుచేశారు. ఈ లోపే్ పెద్ద ఎత్తున తన పార్టీ విధానాలపై చర్చ జరిగేలా చూసుకోనున్నారు. టీఆర్ఎస్ కోసం ఢిల్లీలో ఇప్పటికే కార్యాలయం కూడా నిర్మించారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ ఆఫీస్ కేంద్రంగానే జాతీయ పార్టీ రాజకీయాలు కేసీఆర్ చేయనున్నారు.
డిసెంబర్‌కు జాతీయ పార్టీ ప్రకటిస్తే కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎలా దృష్టి పెట్టగలరన్నది చాలా మందికి సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే అప్పటికి ఇక పది నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంటుంది. జాతీయ రాజకీయాలపనే దృష్టి పెడితే.. తెలంగాణ లోకల్లో పట్టు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయాన్ని కేసీఆర్ ఎందుకు కోరుకుంటారన్నది సీక్రెట్‌గా మారింది. అయితే ఢిల్లీని గురి పెట్టి తెలంగాణ ప్రజల మద్దతు కోరే వ్యూహాన్ని కేసీఆర్ అవలభిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా ఎక్కువ మందిలో ఉన్నాయి.