శనివారం ఉదయం పదిన్నరలోపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ మరో రకంగా అర్థం చేసుకున్నారు. అవి కేవలం సూచనలుగానే భావించారు. ఆ సూచనలు పాటించాల్సిన అవసరం లేదని.. నిర్ణయించుకున్నారు. ఆ కారణంగా చర్చలు ప్రారంభం కాలేదు. కనీసం.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన కూడా చేయలేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల ప్రసక్తే లేదని.. కేసీఆర్ తేల్చి చెబుతున్నారు. హైకోర్టు తదుపరి విచారణను.. ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు.. కేసీఆర్ తాను చేయాలనుకున్నది చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేశారని చెబుతున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. బస్సులన్నింటినీ రోడ్డు మీదకు తీసుకు వచ్చే.. రోడ్ మ్యాప్‌ను కేసీఆర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు , కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున… స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తున్నారంటూ… సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే.. అలాంటి పరిస్థితి లేదని… కచ్చితంగా విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ కూడా ఆదివారం వచ్చినందున.. ఇక ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సుల్ని నడపడమే.. ఇప్పుడు.. ప్రభుత్వ ముందున్న లక్ష్యం.
హైకోర్టు ఆదేశాలనూ.. కేసీఆర్ పట్టించుకోకపోవడంపై.. కార్మిక వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి హైకోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేసింది. జనం చస్తున్నారని.. ఘాటు పదజాలం వాడింది. చర్చలు జరిపి తీరాల్సిందేనని ఆదేశించింది. కానీ.. తీర్పు కాపీ అందలేదన్న సాంకేతిక కారణం చూపి… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో.. చర్చలకు చాన్సే లేదని కార్మికులకు స్పష్టమైన సందేశం పంపుతున్నారు. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలన్న హైకోర్టు ఆదేశాన్నీ… ప్రభుత్వం బేఖాతరు చేసింది.