తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు హైదరాబాదు కన్నా జిల్లాల గురించే శ్రద్ద ఎక్కువంటారు. హైదరాబాదు గురించి చాలా చర్చ జరిగింది, మొన్న జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా భారీ ప్రచారంతో జరిగాయి. ఇవన్నీ నిజమే గాని కెసిఆర్‌కు హైదరాబాద్ వ్యవహారాలంటే చాలా చికాకు అని టిఆర్ఎస్లో సీనియర్ ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. కెటిఆర్ వాటిపై శ్రద్ద చూపిస్తారు గాని సిఎంకు పెద్ద పట్టదు అని కూడా వివరించారు. ఉదాహరణకు మొన్నటి వర్షాల దెబ్బ తర్వాత హైదరాబాదు పరిస్థితిని అధికార స్థాయిలో సమీక్షించి ఆదేశాలు ఇచ్చారంతే. అదే ఉత్తర తెలంగాణ పర్యటనకు ఆఘమేఘాల మీద వెళ్లారు. కాంట్రాక్టరును మార్చేశారు. ఇదంతా కూడా ఆయన ఆలోచనా ధోరణికి ప్రతిబింబమే. ఎప్పటికైనా రాజకీయంగా తన పునాది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే వుందని కెసిఆర్ నమ్ముతారు. అదే హైదరాబాద్ మహానగరం వంటి చోట్ల ప్రజల తీరు, తీర్పులు కూడా చంచలంగా వుంటాయని భావిస్తారు. పైగా ఇక్కడ జిహెచ్ఎంసిలో పేరుకుపోయిన అవినీతి, అక్రమ పద్ధతులు ఆయన సహించలేరు. దీనిపై చర్యలు తీసుకుంటే ఆ సంస్థలో ప్రతివారిపైనా తీసుకోవాలి అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు కదా అని ఆ నాయకుడు వివరించారు.ఇక నాలాల పునరుద్ధరణకై కట్టడాల విధ్వంసం కూడా ఎంతో కాలం సాగకపోవచ్చనే సందేహం ఆ నాయకుడు వెలిబుచ్చడం విశేషం. నిజానికి ఎన్నాళ్లో జరగదనే చెప్పారు.