తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… జాతీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం కోసం.. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి.. ప్రజల్లో దాగి ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బయటకు తెచ్చి.. ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు.. ఆయన దేశ రాజకీయాల్ని సంస్కరించాలనుకుంటున్నారు. తెలంగాణ పేరుతో ఉన్న పార్టీ సరిపోదు కాబట్టి… ఆయన జాతీయ పార్టీగా కొత్త పార్టీని పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ అనేక పేర్లను పరిశీలించినప్పటికీ… కేసీఆర్ “నయా భారత్” అనే పేరు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. రేపోమాపో ఈసీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎన్నికలకు ముందే ఆయన జాతీయ రాజకీయ ఆరంగేట్రం చేయాలనుకున్నారు. అందుకే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే.. వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు.. మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయ అధ్యయనానికి సమయం కేటాయిస్తున్నారు. కుమారుడు కేటీఆర్… అనధికారికంగా ప్రభుత్వాన్ని నడిపించేస్తున్నారు. తాను మాత్రం ఎక్కువగా ఫార్మ్‌హౌస్‌లో జాతీయ రాజకీయాలపై వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికి… ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని .. అందుకే.. తన పార్టీ పేరును… మీడియాకు లీక్ చేశారని అనుకుంటున్నారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కాగానే… కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పదవి అప్పగించేసి.. ఇక ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ రాజకీయాలు చేస్తారని ఇప్పటికే టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దాని కోసం ప్రాతిపదిక రెడీ అయింది. నయాభారత్ పేరుతో.. పార్టీని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లదల్చుకున్నారు. అయితే.. పార్టీ స్వరూపం భిన్నంగా ఉండనుంది. కొన్ని పార్టీల కూటమిగా… ఈ వేదికను రూపొందించే అవకాశం ఉంది. మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ లాంటి వాళ్లతో కేసీఆర్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. నయా భారత్ పార్టీ రూపం… ఇతర పార్టీలతో కలిసి రాజకీయం చేయడం వంటి అంశాలపై కేసీఆర్ ఇప్పుడు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. 2022లో జమిలీ ఎన్నికలు ఖాయమన్న అంచనాకు.., కేసీఆర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. శరవేగంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రాంతీయ పార్టీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న అంచనా ఉంది. అందుకే.. కేసీఆర్… బీజేపీ వ్యూహానికి విరుగుడుగా… జాతీయ పార్టీ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.