తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని వెంటనే హుజూరాబాద్ బరిలో నిలబెట్టాలనే ఆలోచన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బలమైన బీసీ నేతల్లో ఒకరైన ఎల్.రమణ అయితే.. ఈటల రాజేందర్‌కు సమ ఉజ్జీ అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్.. హుజూరాబాద్ విషయంలో అనేక మంది అభ్యర్థిత్వాలపై పరిశీలన చేయించారు. పలు సంస్థలతో సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు.
అయితే వేటిలోనూ పెద్దగా సానుకూలత కనిపించకపోవడంతో.. కొత్త కాంబినేషన్ వైపు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ .రమణ అయితే.. ఈటలతో సరితూగుతారనే అంచనాకు కేసీఆర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. ఎల్.రమణకు కూడా టీఆర్ఎస్ హైకమాండ్ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయన కేసీఆర్‌తో సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ను కలిసినా… తర్వాత కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
పార్టీ మార్పు విషయాన్ని ఎల్.రమణనే స్వయంగా ప్రకటిస్తారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్ని హుజూరాబాద్ ఉపఎన్నిక మార్చనుంది. ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని బరిలో నిలబెడితే… మరింత ఆసక్తికరమైన పోరు సాగే అవకాశం ఉంది.