తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం చేసే పథకాలను విస్తరిస్తోంది. ఇప్పుడు ఒంటరి మహిళలకు నెలవారీ భృతి ఇవ్వడానికి నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాడే మరో మానవీయ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం కింద వెయ్యి రూపాయలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లిస్తామని తెలిపారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఒంటరి మహిళలు కూడా ముందుకు వచ్చి అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నారని కేసీఆర్ చెప్పారు. వీరిలో చాలా మంది ఆర్థిక స్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరూ లేని ఒంటరి మహిళలు ఇబ్బంది లేకుండా సగౌరవంగా బతకడానికి తమ ప్రభుత్వం మానవీయ కోణంలో అండగా నిలుస్తుందని చెప్పారు.
అసెంబ్లీలో ఇవాళ పలు అంశాలపై చర్చ జరిగింది. అన్ని అంశాలపైనా మంత్రులకు బదులు ముఖ్యమంత్రే జవాబు ఇస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. అయితే అదేమీ లేదంటూ అధికార పక్షం ఖండించింది. ఇవాళ ఎస్పీ సబ్ ప్లాన్, అటవీ భూములపై చర్చ జరిగింది. ప్రయివేట్ విశ్వవిద్యాలయాల ప్రతిపాదపైనా స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది.