టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు.. ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ .. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. వెంటనే నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా.. సమావేశమై.. డీఎస్‌పై వేటు వేయాలని తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. కానీ డీఎస్ తాను పార్టీ మారడానిచి చర్చలు జరపలేదన్నారు. అన్ని విషయాలు కేసీఆర్‌తో మాట్లాడతానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ కేసీఆర్ నుంచి డీఎస్‌కు పిలుపు రాలేదు. ఇక ముందు వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకిలా …? అంటే..అంతా కేసీఆర్ ఓ స్ట్రాటజీ ప్రకారం చేశారంటున్నారు.
టీఆర్ఎస్ కారు ఇప్పుడు ఓవర్ లోడ్ అయింది. అందర్నీ సంతృప్తి పరచడం కేసీఆర్‌కు కూడా అసాధ్యం. అందుకే.. ఇప్పటికే చాలా మంది నేతలు.. తాము పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేయించేసుకుంటున్నారు. ఇలాగైనా.. కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేయాలనేది వారి ఉద్దేశం కావొచ్చు. ఇలాంటివారందర్నీ.. ఒక్క డీఎస్ వ్యవహారంతో కేసీఆర్ సెటిల్ చేసేశారట. ఎందకంటే.. పార్టీ మారతారని ప్రచారం జరుగుతన్న వారికి.. డీఎస్ తరహా ట్రీట్మెంట్ ఇస్తారని.. చెబుతున్నారు. ఎందకంటే.. డీఎస్ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు. ఎంట్రీ ఖరారు చేసుకోలేదు. కానీ కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ వైపు చూడకుండా చేశారు. కేసీఆర్ నిరాదరణ చూపించిన తర్వాత ఇక పార్టీలో డీఎస్‌కు భవిష్యత్ ఉండటం అసాధ్యం. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి కూడా ఇదే రకమైకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. భూపతిరెడ్డిపై వేటు వేయాలని నిజామాబాద్ జిల్లా నేతలందరూ తీర్మానించారు. ఇప్పటివరకు కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు భూపతిరెడ్డి కూడా.. టీఆర్ఎస్లో ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి.
కేసీఆర్ వ్యూహంతో.. పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేతల్లో గుబులు ప్రారంభమయింది. ఇంత కాలం.. పార్టీ హైకమాండ్‌కు అదో హెచ్చరికలు ఉంటుందనుకున్న నేతలు.. పార్టీ మార్పు ప్రచారాన్ని ప్రొత్సహించారు. కానీ డీఎస్ ఇష్యూ జరిగిన తర్వాత.. అందరూ పార్టీ ఆఫీసుకు క్యూకట్టి… కేటీఆర్‌కు వివరణలు ఇచ్చుకుంటున్నారు. తాటికొండ రాజయ్య, కొండా సురేఖ, సోమరపు సత్యనారాయణ, ఎంపీ పాటిల్ లాంటి వారంతా.. కేటీఆర్‌ను కలిసి తమపై వస్తున్న వార్తలు పచ్చి అబద్దాలు చెప్పి… మార్కులేయించుకుంటున్నారు. డీఎస్లాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు డీఎస్‌కు టీఆర్ఎస్ను వదిలి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.