తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ముందు ఏదైనా పని అనుకుంటే.. అది అయిపోయిందని మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పని పూర్తి చేయడానికి కసరత్తు ప్రారంభిస్తారు. ఒక వేళ ఆ పని అలా పెండింగ్లో పడిపోయినా.. పట్టించుకోరు. అవసరం ఉన్నప్పుడు..మరోసారి పనైపోయిందని.. మీడియాలో ప్రచారం వచ్చేలా చేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. పనుల విషయంలో కానీ.. ఇతర విషయాల్లో కానీ.. కేసీఆర్ ఇదే ఫార్ములా అవలంభిస్తున్నారు. మీడియా ఆయనకు సంపూర్ణంగా సహకరిస్తోంది.
పంచాయతీ ఎన్నికలు జరిగినట్లేనని హడావుడి చేశారు. న్యాయస్థానాల్లో ఇరుక్కుపోయేలా రిజర్వేషన్లు పెట్టారు. ఉద్యోగ నియామకాలు చాలా ప్రకటించారు. కానీ.. అవి కూడా.. కొత్త జిల్లాలు జోన్ల వివాదంలో ఇరుక్కుపోయేలా చేశారు. కానీ.. ప్రతీ దానికీ.. కేసీఆర్కు పాలాభిషేకాలు జరిగాయి. మహా గొప్ప నేతగా.. టీఆర్ఎస్ నేతలు ప్రశంసలు గుప్పించారు. అంత చేసినా ఒక్క పనిలోనూ.. పురోగతి లేదు. కులాలన్నింటికీ భవన్లు ప్రకటించారు. శంకుస్థాపనలు చేశారు. పాలాభిషేకాలు పొందారు. ఒక్క భవన్ కూడా పునాది స్థాయి దాటలేదు. చాలా భవనాలకు కేటాయించిన భూములు వివాదాల్లో ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్.. ఇప్పుడు కూడా అదే అస్త్రాన్ని వాడుతున్నారు.
జోన్ల విషయం కొలిక్కి వచ్చిందని.. ప్రధాని సంతకం చేశారనే ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ జోన్ల విషయంలో ప్రధాని సంతకం చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర హోంశాఖ క్లియర్ చేసి.. రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. అక్కడ సంతకం పని అయిపోతే.. అప్పుడు జోన్లు అమలులోకి వస్తాయి. కానీ ఇది అంతా తేలిక కాదు. ఎందుకంటే.. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలన్నది.. రాజ్యాంగ వ్యతిరేకతమని..నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎంతో కొంత సడలింపులు లేకపోతే.. జోన్ల ఆమోదం కష్టమేనంటున్నారు. అయినా సరే ఆమోదం పొందిందని… టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసేసుకుంటున్నయి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి..అన్నీ పెడింగ్లోఉన్నాయి.. మళ్లీ ఓట్లు వేయండి.. గెలగానే చిటికెలో చేసేస్తామని హామీలిస్తారేమో..?