గడచిన వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అక్కడి నుంచే వ్యూహరచన చేస్తున్నారు! తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న వార్తలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నవే. అయితే, ఇప్పుడు అదే విషయమై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారనీ, మంత్రివర్గంలో మార్పులపై ఫామ్ హౌస్ లో ప్రముఖ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటూ ఇప్పుడు గుసగుసలు మరోసారి జోరందుకున్నాయి. పార్టీ సీనియర్ల సలహాల మేరకు మార్పులకు సిద్ధమౌతున్నట్టు తెరాస వర్గాలు అంటున్నాయి.
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్, హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి… వీరిని మంత్రి పదవుల నుంచి మార్చే అవకాశం ఉందని ప్రముఖంగా వినిపిస్తోంది. వీరితోపాటు మరో మంత్రిని కూడా మార్చాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారనీ, ఆ పేరు త్వరలోనే బయలకి వస్తుందనీ సమాచారం! మొత్తంగా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన తప్పేట్టు లేదు. ఇక, కొత్తగా కేబినెట్ లోకి రాబోతున్నవారు ఎవరంటే.. స్పీకర్ మధుసూధనాచారి, పద్మా దేవేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, రాజేశ్వర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదే జాబితా ఖరారు అయితే స్పీకర్ తో పాటు, డెప్యూటీ స్పీకర్ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలను కొప్పుల ఈశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలకు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ విస్తరణలోనే ఓ మహిళా మంత్రికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించబోతున్నారు. తెరాస సర్కారుపై ప్రతిపక్షాలు ప్రధానంగా చేసే విమర్శ కూడా ఇదే కదా! కాబట్టి, మహిళలకు స్థానం కల్పించడం ద్వారా వాటికీ చెక్ పెట్టొచ్చనేది తెరాస వ్యూహం.
ఉద్వాసన పలకబోతున్న మంత్రుల విషయంలోనూ కేసీఆర్ చాలా జాగ్రత్తపడుతున్నారట! పార్టీలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ వారికి ప్రముఖ స్థానం కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి సంబంధించి కొన్ని కీలక బాధ్యతల్ని వారికి అప్పగిస్తారట. ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలను కూడా కేసీఆర్ బాగానే సరిచూసుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు. మంత్రి వర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించడం కోసం పల్లం రాజేశ్వర రెడ్డికి అవకాశం ఇస్తున్నారు. ఇక, గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా కీలక మంత్రి పదవి దక్కుతుందని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులకు కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.