అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లతో పాటు పార్టీ కార్యాలయాలను కూడా నిర్మించారు. వాటిని ప్రారంభింంచేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. కానీ ముందుకు సాగలేదు. నాలుగైదు జిల్లాలు తిరగగానే ఏదో ఓ కార్యక్రమం వస్తోంది. దాంతో వాయిదాలు పడిపోతున్నాయి. ఇప్పుడు అసలు కేసీఆర్ జిల్లాల పర్యటన గురించి ఊసే రావడం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ రావాలని ఆహ్వానిస్తున్నారు. పార్టీ కార్యాలయాలు నిర్మాణం పూర్తయిపోయిందని.. ఓపెనింగ్ చేయాలని కోరుతున్నారు. కానీ ప్రగతి భవన్ నుంచి సరైన స్పందన కనిపించడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో జిల్లాల పర్యటన చేయాలని పలువురు నేతలు అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ పర్యటిస్తే పెండింగ్ పనులు పూర్తితో పాటు కొత్త హామీలు ఇస్తారని, నిధులు సైతం మంజూరు చేస్తే ప్రజల దగ్గరకు సాఫీగా వెళ్లవచ్చని భావిస్తున్నారు. అయితే అప్పనిధులను సమకూర్చుకున్న తర్వాతనే జిల్లా పర్యటనలు చేయాలని అందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే కొంతకాలం జిల్లా పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.
కొన్ని జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభం కాలేదు. వాటిని ప్రారంభించేందుకైనా కేసీఆర్ వస్తాడని నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పర్యటనలపై క్లారిటీ లేకపోవడంతో పార్టీనేతల్లో డైలామా నెలకొంది. ముందస్తు ఎన్నికల ఆలోచనతో గతంలో జిల్లాల టూర్లు ప్రారంభించారని… ఇప్పుడు విరమించుకోవడంతో ఆగిపోయారని చెబుతున్నారు. మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత పర్యటనలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.