తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు.. సిద్ధిపేటలో పర్యటించారు. సిద్ధిపేట లేకపోతే తాను లేనని.. అలాగే తాను లేకపోతే.. తెలంగాణ లేదని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే…సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని.. ప్రకటించారు. సిద్దిపేటకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన.. సోషల్ మీడియాలో హైలెట్ అయింది. ట్రోలింగ్‌కు గురయింది. కానీ.. ఏం చేసినా.. ఏదో విధంగా చర్చల్లో ఉండటం కేసీఆర్ స్టైల్. ఏ ప్రతిపాదన లేకుండా.. అలాంటి ప్రకటన చేయరని..ప్రతిపాదన ఉంది కాబట్టే… ప్రజలకు చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు కూడా సమర్థించుకోవడం ప్రారంభించాయి.
సిద్దిపేట ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వ్యవహారం సోషల్ మీడియాలో హైలెట్ అవుతూడంగానే.. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. దీంతో.. సిద్దిపేట వాసుల్లోనే కాదు.. తెలంగాణ ప్రజలు… ముఖ్యంగా సిద్ధిపేట ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గురించి … చర్చించుకున్న వారందరూ… అలర్టయ్యారు. ఏదైనా ప్రకటన వస్తుందేమోనని చూశారు. అయితే… కేసీఆర్ తన వినతి పత్రంలో అసలు సిద్ధిపేట విమానాశ్రయం ప్రస్తావనే తీసుకు రాలేదు. తెలంగాణకు మొత్తం ఆరు ఎయిర్‌పోర్టులు కావాలని ఓ వినతి పత్రం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, వరంగల్ అర్బన్, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి, ఆదిలాబాద్‌లలో విమాశ్రయాలు కావాలని కోరారు కానీ… అసలు తాను రెండు రోజుల ముందట చెప్పిన సిద్ధిపేట ప్రస్తావన తీసుకు రాలేదు.
కేసీఆర్ ప్రకటన… ప్రజలను సంతోషపరచడానికా లేకపోతే మభ్య పెట్టడానికా అని.. సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమయింది. శంషాబాద్‌లో విమానాశ్రయం నిర్మించిన జీఎంఆర్‌తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం… 30 ఏళ్ల పాటు… శంషాబాద్ విమానశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించకూడదు. అంటే.. సిద్ధిపేటలో నిర్మించే అవకాశం లేదు. దీన్నే కొంత మంది గుర్తు చేసి… కేసీఆర్ మాయ మాటలు చెబుతున్నారని విమర్శించడం ప్రారంభించారు. ఇప్పుడు.. కేంద్రానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో కూడా ఆ ప్రస్తావన లేకపోవడంతో… కేసీఆర్ పై విమర్శలు చేయడానికి మరో కారణం దొరికినట్లయింది.