తెలుగుదేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని… అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఈ విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే చెందినవి కాదు. తెలంగాణకు రావాల్సినవి చేయాల్సినవి ఏవీ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే.. ఏపీకి ఇచ్చిన వాటిలో కనీసం ఓ పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వలేదు. మరి… కేసీఆర్ ఎందుకు .. అవిశ్వాసానికి దూరం అంటున్నారు..?. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసి కూడా ఎందుకు .. బీజేపీకి పరోక్ష మద్దతు తెలియజేస్తున్నారు..?.
కొద్ద రోజుల కిందట.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. పార్లమెంట్లో తమ పోరాటానికి మద్దతివ్వాలంటూ కేసీఆర్‌ను కలుసుకోవాలనుకున్నారు. కానీ కేసీఆర్ సమయం ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యుడు కేకేతో వారు సమావేశమయ్యారు. కేకే కూడా.. విభజన హామీలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ కూడా నష్టపోతుందని… టీడీపీకి అన్ని విధాలుగా మద్దతిస్తామన్నారు.
కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని మాత్రం రాజకీయ ఎత్తుగడగా తేల్చేసుకుని… లైట్ తీసుకోవాలని డిసైడయ్యారు. అంటే.. బీజేపీకి క్లిష్ట పరిస్థితులైతే అనుకూలంగా ఓటేయడం.. తమ ఓట్లు అంత ప్రాధాన్యం కాదనుకుంటే బాయ్ కాట్ చేసే వ్యూహాలను టీఆర్ఎస్ అమలు చేస్తుంది. అయితే.. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొంటామని… మాత్రం స్పష్టం చేస్తున్నారు. తమ రాష్ట్ర విభజన హామీలపై గళం వినిపిస్తామంటున్నారు. అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో అడ్మిట్ అయిన తర్వాత కేసీఆర్ ఎంపీలతో మాట్లాడారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎంపీలకు హితబోధ చేశారు. తెలంగాణ విభజన సమస్యలను లేవనెత్తాలని చెప్పారు.
కేసీఆర్ వ్యూహంపై.. టీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నారు. తాము బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయనేదే వారి ఆందోళన. ఇప్పటికే బీజేపీతో … టీఆర్ఎస్ రహస్య స్నేహం చేస్తోందనే భావన పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే.. ముస్లిం ఓటు బ్యాంక్‌పై ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేయకపోతే.. కాంగ్రెస్ దాన్ని ముస్లింలలోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్.. తాను.. బేషరతుగా… అవిశ్వాసానికి మద్దతిస్తానని ఇప్పటికే ప్రకటించేశారు.