పార్టీ ఖాళీ అవుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటున్నారు. రోజుకు మొక్కలు ఎంత పెరిగాయో లెక్కలు తీసుకుంటున్నారు కానీ పార్టీ ఎంత తరిగిపోతుందో పట్టించుకోవడం లేదు. పార్టీలో ఉన్న నేతలందరిపైనా పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది. దీంతో కొంత మంది ఫామ్ హౌస్ కు వచ్చి.. తాము పార్టీ మారడం లేదని చెప్పి వెళ్లాలనుకుంటున్నారు. వారితో కేసీఆర్ ఒకటి, రెండు నిమిషాలు మాట్లాడి పంపించేస్తున్నారు. అసలు పట్టించుకోవడం లేదని అంటారని.. గ్రేటర్ ఎమ్మెల్యేలందరూ ఓసారి ఫామ్ హౌస్ కు రావాలని పిలిచారు. మంగళవారం కొంత మంది వెళ్లారు. దీంతో వెళ్లని వాళ్లపై పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది.
పోనీ వెళ్లిన వాళ్లు ఉంటారా… ఆ నమ్మకం కూడా లేదు. కాంగ్రెస్ నుంచి సిగ్నల్ కోసం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఆయన కండువా కప్పుకోవాల్సింది. ఎన్నికల తర్వాత కు టైం మార్చుకున్నారు. తన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఒడిదుడుకులు బి ఆర్ ఎస్ కు కొత్త కాదని కొంచెం ఓపిక పడితే మళ్ళీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని కేసీఆర్ చెబుతున్నారు. , ఇప్పటికే బి ఆర్ ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్ , తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ అంటున్నారు.
కేసీఆర్ తీరు చూస్తే తాము లేని లోటును ప్రజలు ఫీల్ అవుతారని.. మళ్లీ పిలిచి మరీ పట్టం కడతారన్న ధీమాలో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. ప్రజల కోసం ఇప్పటికిప్పుడు రోడ్డెక్కడం కన్నా… ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగే వరకూ ఉండాలని అనుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పుడు తనకు అలవాటైన మౌన వ్యూహంలో ఉన్నారు.