తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా ఏం మట్లాడినా దానికో అర్థం ఉంటుంది. అసెంబ్లీలో ఆయన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రం విధానాలపై భట్టి చాలా ఆవేశంగా మాట్లాడారని, కానీ అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా ప్రయోజనమేంటని వ్యాఖ్యానించారు. ఆయన ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా తూర్పారా బట్టవచ్చని, ఎంపీ కావాలని కోరుకుందామన్నారు. భట్టిపై కేసీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపడం సహజమే.
కాంగ్రెస్ పార్టీ పైఇటీవల భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌ను చేయడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే దళిత బంధు పేరుతో ప్రభుత్వం పెట్టిన సమావేశాలకు ఆయన హాజరయ్యారు. తన నియోజకవర్గంలో ఓ మండలంలో మొత్తం దళిత బంధు అమలు చేసేందుకు పెట్టిన సమావేశానికీ హాజరయ్యారు. దళిత బంధు మోసమని కాంగ్రెస్ అధికారికంగా ఆరోపణలు చేస్తోంది. అయినా పట్టించుకోలేదు. తరచూ టీఆర్ఎస్ విషయంలో ఆయన కార్నర్ అయిపోతున్నారు. టీఆర్ఎస్ ఆయనపై ఎక్కడా లేనంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది.
భట్టి ఎంపీ అవ్వాలని మనమంతా కోరుకుందామని కేసీఆర్ అనడం టీఆర్ఎస్లోనూ చర్చ జరుగుతోంది. ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి.. ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ అనుకుంటే ఏదైనా చేయగలరు..అలాంటి ఆలోచన లేకుండా విపక్ష నాయకుడి విషయంలో అలాంటి ప్రకటనలు చేయరని.. టీఆర్ఎస్ నేతలే గట్టిగా నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్లోఉన్నప్పుడు పువ్వాడ అజయ్ విషయంలోనూ అలాగే మాట్లాడారు. త్వరలో ఆయన పార్టీలోకి వస్తారని చెప్పుకున్నారు. అలా ప్రారంభించిన మైండ్ గేమ్ చివరికి పువ్వాడ టీఆర్ఎస్ లో చేరడంతో ముగిసింది. బహుశా.. భట్టి ఎపిసోడ్ కూడా అలా ముగుస్తుందేమో ? అని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడటం ప్రారంభించారు.