తెలంగాణలో విద్యావ్యాప్తికి ఎంతగానో దోహదం చేసిన రెడ్డి హాస్టల్(రాజ్‌బహుదూర్ పింగళి వెంకటరామారెడ్డి) శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం చాలా మందిని ఆకట్టుకుంది.హాస్టల్, మహిళా కాలేజీ విస్తరణకు అదనపు స్థలం, పది కోట్ల నిధి కేటాయిస్తామని, కావాలంటే మరో పది కోట్లు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఈ సందర్బంగానే హౌం మంత్రి నాయని నరసింహారెడ్డి పేరు (నరసన్న) ప్రస్తావించి ఆయన మాటంటే ఆదేశమేనని, ఆ మేరకు తాను కలెక్టర్‌తో మాట్లాడి ఏర్పాట్లు కేటాయింపులు చేస్తున్నానని కూడా నవ్వుతూ అన్నారు. నాయని పెద్దమనిషిగా అందరికీ గౌరవనీయులే గాని అధికార వ్యవస్థలో ఆయన పట్టు ఎంత పరిమితం అన్నది కూడా అందరికీ తెలుసు. పైగా ఈ సభలోనే ఆయన హటాత్తుగా కుల సమీకరణల గురించి మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కులాల వారి జనాభాను బట్టి రెడ్ల ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన కథనాలను ఖండించారు. ఆ విధంగా ఆయనే ఆ చర్చకు బీజం వేశారు. రెండు రోజుల కిందటే వెంకయ్య నాయుడు సత్కార సభ సందర్భంగానూ సందేహాలకు అవకాశమిచ్చిన ప్రభుత్వం ఈ సందడి చేయడంలోనూ వ్యూహం వుందని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోనూ కులాల పట్టు అంటూ నేను గత వారం రాసిన వ్యాఖ్య చూస్తే ఇవన్నీ యాదృచ్చికంగా జరగడం లేదని అర్థమవుతుంది. రెడ్డి హాస్టల్ కులాలకు అతీతంగా విద్యావ్యాప్తికి బాట వేసిన మాట నిజమే.కాని ప్రధాన మంత్రులూ కేంద్రమంత్రులూ ఎందరినో అందించిందని చెప్పిన కెసిఆర్ కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి వంటివారి పేర్లు ప్రస్తావించకపోవడం గమనించదగ్గది. తర్వాతి కాలంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి అక్కడే అంకురార్పణ జరిగింది. ఒక దశలో ఆ హాస్టల్‌ను దిగ్గంధనం చేసే పరిస్థితి కూడా వచ్చింది. 1946-51 తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ఎప్పుడూ గొప్పగా చెప్పని ముఖ్యమంత్రి షరా మామూలుగా ఈ సభలోనూ దాటేశారు. ఆయన గొప్పగా మాట్లాడితే కులాల లెక్కలేమిటని కొందరు కోప్పడుతున్నారు. కాని నాయని మాట్లాడిన దాంట్లోనే ప్రభుత్వ ఆలోచన తెలుస్తుంది. మరో తమాషా ఏమంటే హాస్టల్ అభివృద్ధికి పది కోట్లు నిధి ఇచ్చిన ప్రభుత్వం వాటిపై ప్రకటనకు పదిహేను కోట్లు ఖర్చు చేసిందట. తెలంగాణ ప్రముఖుల పేర్లు తొక్కేసారని చెప్పిన కెసిఆర్ అంతకు ముందు వెంకయ్య వేడుకలో ఎందుకు ఎన్టీఆర్ పేరుతోనే సరిపెట్టారన్న ప్రశ్న కూడా రాకపోలేదు. రాజకీయమెప్పుడూ అవసరాలను బట్టి వ్యూహాలను బట్టి నడుస్తుంటుంది కదా!